రామాయంపేట, డిసెంబర్ 30: అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో చోటుచేసుకున్నది. స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం .. ధర్మారం గ్రామానికి చెందిన అక్కమొల్ల శ్రీకాంత్‌యాదవ్ (26) కొద్ది రోజుల క్రితం తన వ్యవసాయ భూమిలో 3 లక్షల వ్యయంతో బోర్లు వేయించారు. నీళ్లు పడకపోవడం, వాటి కోసం తెచ్చిన అప్పులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు.
అప్పు తీర్చే మార్గంలేక నాలుగు రోజుల క్రితం ఇంట్లో పురుగులమందు తాగాడు. కుటుంబీకులు గమనించి వెంటనే రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ దవాఖానకు తీసుకెళ్లి నాలుగు రోజులుగా చికిత్స చేయించారు. సోమవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. మృతుడి తండ్రి పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ కొడుకుకు తలకొరివి పెట్టాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.