చిట్యాల, మార్చి 11 : అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కైలాపూర్ గ్రామ శివారు శాంతినగర్లో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోతూరి కుమారస్వామి (35) తనకున్న మూడెకరాల వ్యవసాయ భూమిలో పత్తి, మిర్చి సాగు చేశాడు. గత మూడేళ్లుగా సరైన దిగుబడి రాకపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చినవి, గతంలో ఉన్నవి కలిపి సుమారు రూ.10 లక్షల వరకు అప్పులయ్యా యి. ఈ క్రమంలో అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెంది మంగళవారం తన పంట చేను సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిట్యాల సివిల్ దవాఖానకు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై ఈశ్వరయ్య తెలిపారు.