బచ్చన్నపేట, ఏప్రిల్ 30: అభంశుభం తెలియని నాలుగేండ్ల చిన్నారి మిషన్ భగీరథ పైపుల కోసం తీసిన గుంతలో పడి మృత్యువాత పడిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..ఆలింపూర్ గ్రామానికి చెందిన ఎలికట్టె శ్రీనివాస్- కవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు దక్షిత ఒకటో తరగతి చదువుతుండగా, చిన్న కుమార్తె మోక్షిత (4) అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నది. కవిత గ్రామంలో అంగన్వాడీ ఆయాగా పని చేస్తున్నది.
గురువారం కవిత తన ఇద్దరు కూతుళ్లను పాఠశాల గేటు పక్కన నిలబెట్టి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. గేటు పక్కనే మిషన్ భగీరథ పైప్‌లైన్ కోసం తీసిన గుంతలో మోక్షిత పడిపోయింది. వెంటనే దక్షిత తల్లికి విషయం చెప్పడంతో ఆమె పరుగెత్తుకొని వచ్చి గుంతలో నుంచి చిన్నారిని బయటకు తీసింది.
మోక్షిత పరిస్థితి విషమంగా ఉండటంతో జనగామ వైద్యశాలకు తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చిన్నారి మృతదేహంతో జనగామ- సిద్దిపేట జాతీయ రహదారిపై పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహిచారు.
మిషన్ భగీరథ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో చిన్నారి మరణించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 20 రోజుల కింద తీసిన గుంతను పూడ్చకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఎస్సై శ్రీకాంత్, నర్మెట సీఐ అబ్బయ్య వచ్చి మిషన్‌భగీరథ కాంట్రాక్టర్లను పిలిపించి న్యాయం చేస్తామని, బాధితుల పక్షాన నలుగురు పెద్ద మనుషులు రావాలని నచ్చచెప్పడంతో రాస్తారోకో విరమించారు.