మోర్తాడ్, జూలై 30: కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని తన నివాసంలో.. నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై బుధవారం సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ చెప్పినట్టు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.లక్ష చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా చెక్కులు మంజూరయ్యే లబ్ధిదారులతోపాటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి చెక్కులు అందుకున్న వారందరికీ తులం బంగారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పటివరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ప్రశాంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.