KTR | తన కాన్వాయ్‌పై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాడిని కాదని.. మీ తాట తియ్యడానికే వచ్చానంటూ సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
నా ప్రజలకు అండగా నిలబడడాన్ని నువ్వు ఆపలేవని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పేద ప్రజల తరఫున తాను ఉన్నన్ని రోజులు ఏ బుల్డోజర్లు తమ గొంతును ఆపలేవని చెప్పారు. నీ గూండా రాజ్యాన్ని సవాలు చేసే తన స్ఫూర్తిని ఏ గూండాలు అడ్డుకోలేరని స్పష్టం చేశారు. నా వాహనంపై గూండాలు చేసిన దాడి నా సంకల్పాన్ని మరింత పెంచుతాయి.. వెనక్కి తగ్గేదే లేదని తెలిపారు.
మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అన్నారు. మీ తాట తియ్యడానికే వచ్చానని హెచ్చరించారు. నీ పిల్లి కూతలకు భయపడేవాళ్లు ఎవ్వరూ లేరిక్కడ అని అన్నారు. ఉద్యమాల పిడికిలి ఇది గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చారు.
అసలేం జరిగింది?
మూసీ- హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డారని ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపైనా దాడికి తెగబడ్డారు. గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ముషీరాబాద్‌లో కేటీఆర్ కారును అడ్డుకున్నారు. ఆపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ గూండాలు ఏ మాత్రం తగ్గలేదు. కొందరైతే ఏకంగా కారుపైకి ఎక్కి మరీ దురుసుగా ప్రవర్తించారు. చివరకు బీఆర్ఎస్ శ్రేణులు వారిని తన్ని తరిమివేశారు. అనంతరం అంబర్‌పేట గోల్నాక పరిధిలోని తులసీరామ్ నగర్ వెళ్లిన కేటీఆర్ అక్కడ మూసీ బాధితులను పరామర్శించారు.