Honey Trap | హానీట్రాప్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యోగా గురువు చిక్కాడు. ఆశ్రమంలో చేరిన ఇద్దరు యువతులు అతనికి సన్నిహితంగా మారి.. అనంతరం ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు దిగారు. ఇప్పటికే రూ.50 లక్షల వరకు కాజేసిన ఆ గ్యాంగ్.. మరో రెండు కోట్లు డిమాండ్ చేయడంతో యోగా గురువు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన యోగా గురువు రంగారెడ్డి ఒక యోగాశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే అతని నుంచి భారీగా డబ్బులు గుంజాలని అమర్ గ్యాంగ్ ప్లాన్ వేసుకుంది. ఈ క్రమంలోనే ఆ గ్యాంగ్ సహాయంతో ఇద్దరు మహిళలు చేరారు. కొద్దిరోజుల్లోనే వారిద్దరూ కూడా యోగా గురువు రంగారెడ్డికి క్లోజ్ అయ్యారు. అతనితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలను తీశారు. ఆ తర్వాత ఆ ఫొటోలు, వీడియోలను అమర్ గ్యాంగ్ చూపించి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. ముందుగా రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. భయపడిపోయిన రంగారెడ్డి.. వారు అడిగిన సొమ్మును చెక్కు రూపంలో ఇచ్చాడు. అయినప్పటికీ అమర్ గ్యాంగ్ బ్లాక్మెయిల్ చేయడం ఆపలేదు. మరో రెండు కోట్ల డబ్బులు ఇవ్వాలని వేధింపులకు దిగింది.
వాళ్లకు లొంగితే మళ్లీ మళ్లీ వేధింపులకు దిగుతారని భావించిన రంగారెడ్డి వెంటనే గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఐదుగురు నిందితులు అమర్, మౌలాలి, రాజేశ్, మంజుల, రజినీలను అరెస్టు చేశారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.