హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఢీకొట్టిన ఏకైక మొనగాడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కొనియాడారు. శు క్రవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారం లేని రాష్ర్టాల్లో అధికారంలోకి రావడానికి ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఆఫర్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక తాటి పైకి వచ్చి, మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ర్టాల అభివృద్ధికి సహకరించని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీతో తనిఖీలు చేయించి భయపెడుతున్నారని ఆరోపించారు. మోదీ.. రైతులకు, కూలీలకు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకి అంటూ ఘాటు వ్యాఖ్యలుచేశారు.