కాశీబుగ్గ/హైదరాబాద్, జనవరి 21 : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం ఎల్లో రకం మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగిర్థిపేటకు చెందిన రూపిరెడ్డి వేణు 3 బస్తాల ఎల్లో రకం మిర్చి మార్కెట్‌కు తీసుకు రాగా క్వింటాకు రూ. 44,001 ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే ఇది రికార్డు ధర అని అధికారులు తెలిపారు. వదినపల్లి సత్యవర్ధన్ అడ్తి ద్వారా జ్యోతి ఇండస్ట్రీస్ మిర్చి ఖరీదు వ్యాపారి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ఈ రకం మిర్చి అధికంగా కుర్కురే, ఆలుచిప్స్ వంటి తిను బండారాల్లో ఉపయోగిస్తారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతదేశంలో బాగా వినియోగిస్తారని వ్యాపారులు తెలిపారు. అకాల వర్షాల కారణంగా మిర్చి పంట దెబ్బతిన్నదని, దీంతో దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగిందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం పసుపు మిర్చి ధర క్వింటాల్‌కు రూ.16వేల నుంచి రూ.17వేల మధ్య ఉండేనని, కానీ ఈ సారి ధర రెండింతలు పెరిగిందని వెల్లడించారు. వరంగల్ జిల్లా నుంచే కాకుండా కరీంనగర్, ఖమ్మం, కృష్ణా, నల్లగొండ జిల్లాల నుంచి కూడా రైతులు తమ పంటను ఈ మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తుంటారని పేర్కొన్నారు.
వరంగల్ మార్కెట్లో ఈ ఏడాది తేజ రకం మిర్చి రికార్డుస్థాయిలో ధర పలికింది. గత మూడేండ్లుగా తగ్గుముఖం పట్టిన మిర్చి ధర బుధవారం క్వింటాకు రూ.22,200 పలికింది. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కునూర్‌కు చెందిన సమ్మిరెడ్డి 12 బస్తాల తేజ రకం మిర్చి మార్కెట్‌కు తీసుకురాగా.. లక్ష్మీసాయి ట్రేడర్స్ అడ్తి ద్వారా ఖరీదు వ్యాపారి కొనుగోలు చేశారు.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట తెచ్చిన జీరో టికెట్ల జారీ సమయంలో కొన్ని సందర్భాల్లో పురుషులకు అనుకోకుండా ఆ టికెట్ జారీ అవుతున్నదని.. అయితే తనిఖీల పేరిట అధికారులు ఉద్యోగులను తొలగించడం సరికాదని టీజీఎస్ఆర్టీసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం వారు ప్రకటన విడుదల చేశారు. అధికారులు ఇలాంటి కేసులను మానవీయ కోణంలో ఆలోచించాల్సి ఉండగా.. కఠినమైన శిక్షలు విధిస్తున్నారని వాపోయారు. దీంతో కొంతమంది తీవ్ర మనోవేదనకు గురై చనిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.