ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 6 : దాదాపు పదేండ్లు నీళ్లు, కరెంటుకు ఇబ్బంది లేకుండా గడిపిన రైతులు ఇప్పుడు పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. సరిగా కరెంటు రాక.. బోరుబావుల్లో నీళ్లు లేక.. కళ్లముందే ఎండిపోతున్న పంటలను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్, రాజన్నపేట, కిష్టూనాయక్తండా, గొల్లపల్లి, దేవునిగుట్టతండా, బాకుర్‌పల్లి తండాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. పదేండ్ల కాలంలో ఈ గ్రామాల్లోని ప్రతి చెరువు నిండుకుండలా మారి బోరుబావుల్లో పుష్కలమైన నీరు ఉండేది. 24 గంటల కరెంటు వచ్చేది. మల్కపేట రిజర్వాయర్ కాల్వలో పారే నీరు ఎక్కువై కట్టలు, మత్తడి తెంపిన రోజులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయి.. కరెంటు, పంట నీళ్ల కోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మల్కపేట రిజర్వాయర్ నుంచి కాల్వలకు నీళ్లు విడిచి రాజన్నపేటలోని కొచ్చెరువు, తిమ్మాపూర్‌లోని మైసమ్మ చెరువు నింపాలని ఇటీవల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు వినతిపత్రమిచ్చినా నీళ్లు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అ ల్మాస్పూర్ నుంచి బాకుర్‌పల్లి వరకు కాల్వను ఆనుకుని 800 ఎకరాలు సాగవుతుండగా, నీరు రాక పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మా రిందని అంటున్నారు. కొచ్చెరువు, మైసమ్మ చెరువుల్లో నీళ్లు తగ్గి బోర్లు ఇంకిపోయాయని, కొత్తగా వేసినా ఫలితం లేదంటున్నారు. ఇప్పటికే 70 ఎకరాల్లో పంటలు ఎండిపోగా పది రోజుల్లో మిగతా పంటలూ ఎండిపోయే ప్ర మాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.