Yellampalli Project | కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పైసా ఉపయోగం లేదు. ఈ ప్రాజెక్టుతో ఒక చుక్క కూడా అదనంగా రాలేదు. ఒక్క ఎకరం ఆయకట్టు కూడా ఏర్పడలేదు. నీళ్లు పారలేదు. ఇదీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, వాదనలు.
మరి ఇప్పుడేమంటున్నరు? రాష్ట్రంలో కరువుకు, కాల్వల్లో నీళ్లు లేకపోవడానికి, ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి వెళ్లడానికి కాళేశ్వరం పిల్లర్లు కుంగడమే కారణం. పిల్లర్లు కుంగడంతో కాళేశ్వరం నీళ్లను కిందికి వదిలివేయడం వల్లే రాష్ట్రంలో నీటి సమస్య ఏర్పడింది.
ఈ రెండు వాదనల్లో ఏది నిజం? ఎన్నికలకు ముందు ప్రచారం చేసినట్టు కాళేశ్వరం వల్ల ఏ ఉపయోగం లేదా? అదే నిజమైతే కాళేశ్వరంలో నీళ్లు ఉన్నా, వదిలినా ఒక్కటే. ఈ కరువు రానే రాకూడదు.
మరి ఇప్పుడు చెప్తున్నట్టు కాళేశ్వరం నీళ్లు వదిలివేయడం వల్లే నీటి సమస్య ఉత్పన్నమైందంటే కాళేశ్వరం తెలంగాణకు వరదాయని అని ఒప్పుకున్నట్టే. పిల్లర్లు కుంగిన తర్వాత కూడా ప్రాణహిత నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా, చేయకపోవడం తప్పేనని చెంపలేసుకున్నట్టే!
మేడిగడ్డ నుంచి గోదావరి నీళ్లను అవసరమైనప్పుడు ఎల్లంపల్లిలోకి ఎత్తిపోసుకొని ఎక్కడికంటే అక్కడికి తరలించే అవకాశముండేది. ఒకవేళ పైనుంచి వరద వస్తే ఎల్లంపల్లి నుంచి కిందికి నీళ్లను వదిలేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ వెసులుబాటును గుర్తించకుండా కాళేశ్వరానికి నీళ్లు రివర్స్‌పంపింగ్ అని ఎన్నికలకు ముందు దుష్ప్రచారం చేశారు. మరి ఎల్లంపల్లికి కాళేశ్వరం నీళ్లు అవసరమే లేకపోతే ఇప్పుడు అదెందుకు ఖాళీగా ఉంది. ఏ నీళ్లతో దాన్ని నింపుతారు? ఇవి సాగునీటి నిపుణులు అడుగుతున్న ప్రశ్నలు.
కరీంనగర్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన ప్రాజెక్టులు నేడు వెలవెలబోతున్నా యి. నాడు 365 రోజులూ నిండుకుండలా దర్శనమిచ్చిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎండిపోతున్నది. దీంతో హైదరాబాద్‌కు మంచినీటి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఎల్లంపల్లి నుంచి ఇప్పటికే రోజుకు నాలుగు మిలియన్ గ్యాలన్ల నీటిని తగ్గించి తరలిస్తున్నారు.
నాలుగు నెలల క్రితం వాటర్‌హబ్‌గా కళకళలాడిన శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయ ప్రాంతం ప్రస్తుతం ఎడారిని తలపిస్తున్నది. గత పదేండ్లలో ఏనాడూ తాగు, సాగునీటికి సమస్య లేని దిగువ మానేరు కూడా డెడ్సోరేజీకి చేరింది. మంచినీళ్లు కూడా అందివ్వలేని దుస్థితిలో చిక్కుకున్నది. రెండు కొండల మధ్య నిండుకుండలా కనువిందు చేస్తూ, కొండపోచమ్మ వరకు నీటిని అందించేందుకు దోహదపడిన అన్నపూర్ణ రిజర్వాయర్ సైతం అడుగంటిపోయింది. ఇంత జరుగుతున్నా, మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ససేమిరా అంటున్న తీరు సాగు, అటు తాగునీటి సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్నది.
ఎల్లంపల్లిలో 6.75 టీఎంసీల నీరు
ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.75 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. నిరుడు ఇదే సమయంలో 13.5 టీఎంసీల నీటితో కళకళలాడింది. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటును సాకుగా చూపి, ఎత్తిపోతలను నిలిపివేయడంతో ఎల్లంపల్లి ఎండిపోతున్నది. ఈ ప్రాజెక్టు నుంచి ఏటా హైదరాబాద్‌కు 10 టీఎంసీలు, ఎన్టీపీసీకి 6.5 టీఎంసీలతోపాటు మిషన్‌భగీరథ, రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)కు నీటిని సరఫరాచేయాల్సి ఉన్నది. వీటితోపాటు 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశారు. గత పదేండ్లలో ప్రాజెక్టు పరిధిలో నీటికి ఎప్పుడూ ఢోకా రాలేదు.
ఏ మాత్రం నీరు తగ్గినా మేడిగడ్డ నుంచి ఎత్తిపోసేవారు. కానీ, ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. అబుల్ కలాం సుజల స్రవంతి పథకం కింద ఏటా 10 టీఎంసీల నీటిని హైదరాబాద్‌కు సరఫరా చేయడానికి బ్రాహ్మణపల్లి వద్ద పంపుహౌస్ ఏర్పాటుచేశారు. ప్రాజెక్టులో 141 మీటర్లపైన నీరు ఉంటేనే ఈ పంపుహౌస్‌కు నీరు అందుతుంది. నీటిమట్టం ప్రస్తుతం 141.5 మీటర్లకు పడిపోయింది. ఒకటి రెండు రోజుల్లో పంపుహౌస్‌కు నీరు అందే పరిస్థితి లేదు. దీంతో డెడ్‌స్టోరేజీ నుంచి 20 పంపుల ద్వారా నీటిని ఎత్తి పంపుహౌస్‌కు పంపే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు నుంచి నిత్యం 178.88 మిలియన్ గ్యాలన్ల నీటిని హైదరాబాద్‌కు సరఫరా చేయాల్సి ఉన్నది. కానీ, ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో గత కొద్దిరోజులుగా 174.34 మిలియన్ గ్యాలన్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ పరిమాణం రోజురోజుకూ తగ్గిపోతున్నది. మరో రెండు మూడు రోజులు గడిస్తే ఈ నీటిని కూడా హైదరాబాద్‌కు తరలించడం కష్టమేనని అధికారులు చెప్తున్నారు. దీంతో, ప్రాజెక్టులో రోడ్డు వేసి డెడ్‌స్టోరేజీ నుంచి ఎత్తిపోసి పంపుహౌస్‌ను నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ని పంపులు పెట్టినా, హైదరాబాద్‌కు ఇవ్వాల్సినంత నీటిని సరఫరా చేయలేమని అధికారులు చెప్తున్నారు.
హైదరాబాద్‌కు మంచినీటి సమస్య పొంచి ఉన్నట్టే. మోటర్ల ద్వారా పంపుహౌస్‌కు ఎత్తపోసే నీటి నుంచే ఆర్‌ఎఫ్‌సీఎల్‌తోపాటు మిషన్‌భగీరథకు వాడుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ప్రాజెక్టు నుంచే ఎన్టీపీసీకి కూడా నీళ్లు ఇవ్వాల్సి ఉన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నది.
కాంగ్రెస్ పాలనలో ఆ ఊసే లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సాగు, తాగునీటిని అందిస్తూ, మరోవైపు ఎత్తిపోతల పథకం కింద కొండపోచమ్మసాగర్ వరకు నీటిని అందించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా తయారైంది. ఇంత జరుగుతున్నా, మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఎన్నో అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతున్నదన్న విమర్శలొస్తున్నాయి.
అడుగంటిన అన్నపూర్ణ.. ఎడారిలా మధ్యమానేరు
వాటర్‌హబ్‌గా పేరొందిన శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయం సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.98 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. ఈ ప్రాజెక్టుపై పెట్టుకున్న ఆశలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అడియాసలయ్యాయి. నిరుడు ఇదే సమయంలో ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు ఉన్నది. కాళేశ్వరం ఎత్తిపోతలు లేకపోవడం, ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు వెనుక భాగం మొత్తం ఎడారిని తలపిస్తున్నది.
మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి ఎగువకు అంటే కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు నీళ్లు వెళ్లాలంటే, ముందుగా అన్నపూర్ణ రిజర్వాయర్‌కు తరలించాలి. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో రెండు కొండల మధ్య నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.5 టీఎంసీలు మాత్రమే ఉన్నది. ఈ ప్రాజెక్టును నింపి, అక్కడి నుంచి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌కు, అక్కడి నుంచి ఎగువమానేరు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోల ద్వారా ప్రాజెక్టులను నిండుకుండలా నింపింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రకృతి రమణీయంగా ఉండేది. రెండు కొండల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు సైతం సిద్ధం చేసింది. అటువంటి ప్రాజెక్టు ప్రస్తుతం అడుగంటి పోయింది. కనుచూపు మేరలో నీటిచుక్క కనిపించడం లేదు. మధ్యమానేరుకు దిగువన ఉన్న దిగువమానేరు జలాశయం సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.208 టీఎంసీలు మాత్రమే ఉన్నది.
ఇది కూడా దాదాపు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నది. ఈప్రాజెక్టుకు పక్కనే ఉన్న కరీంనగర్ కార్పొరేషన్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోజూ మంచినీరు సరఫరా చేసేవారు. ఇప్పుడు రెండు రోజులకోమారు సరఫరా చేస్తున్నారు. నిజానికి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 24 గంటలపాటు మంచినీటి సరఫరాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఆ మేరకు పనులు కూడా చేసింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిత్యం నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
ప్రభుత్వం భేషజాలు వీడితేనే సమస్యకు పరిష్కారం
కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం భేషజానికి పోతున్నదన్న విమర్శలున్నాయి. మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగినా కాపర్‌డ్యాం ఏర్పాటుచేసి, కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులను నింపవచ్చంటున్న నిపుణుల సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. దీంతో రాష్ట్రంలో నీటి సంక్షోభం తీవ్రమయ్యే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే, ప్రాజెక్టుల్లో నీళ్లు లేక భూగర్భజలాలు అడుగంటి పోయాయి.
నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో పాతకాలపు కరవుఛాయలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వరద కాలువను మూడు రిజర్వాయర్లుగా మలచడం వల్ల 122 కిలోమీటర్ల కాలువ పొడవునా ఉన్న పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పైకి ఎగజిమ్మాయి. ప్రస్తుతం ఈ ప్రాంత రైతులంతా మళ్లీ బోర్ల బాట పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మెట్ట ప్రాంతం భూగర్భజలాలు పెంపుదల విషయంలో ఐఏఎస్‌లకే ఒక పాఠ్యాంశంగా మారగా, ఇప్పుడు అదే ప్రాంతం మళ్లీ కరువుకు కేరాఫ్‌గా మారుతున్నది.
కాళేళ్వరం నీళ్లు ఎత్తిపోయకపోవడంతో ఈ యాసంగి సీజన్ వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి అన్నదాతలు నష్టపోయారు. భవిష్యత్తులో మంచినీటికి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి యుద్ధ ప్రాతిపదికన మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపే విషయంపై దృష్టిపెట్టాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. ఏ మాత్రం అలసత్వం వహించినా.. రాష్ట్రంలో నీటి సంక్షోభం తీవ్రరూపం దాల్చడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.