హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఎంవీ రావు స్పష్టం చేశారు. సీఎంకు ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్ చేస్తామని చెప్పారు. గత రెండు రోజుల నుంచి బలహీనంగా ఉన్నట్లు సీఎం చెప్పారు. ఎడమ చేయి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు సాధారణ పరీక్షలతో పాటు ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు నిర్వహించామని డాక్టర్ ఎంవీ రావు పేర్కొన్నారు. కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేశామన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంవీ రావు స్పష్టం చేశారు.
స్వల్ప అస్వస్థతకు గురైన కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో శుక్రవారం ఉదయం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్‌తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు యాంజియోగ్రామ్ పరీక్షలు పూర్తయినట్లు ఎంవీ రావు స్పష్టం చేశారు. యాంజియోగ్రామ్ టెస్ట్ నార్మల్‌గా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఎలాంటి బ్లాక్స్ లేవని డాక్టర్లు తెలిపారు.
కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, మనుమడు హిమాన్షు, కూతురు కవిత, అల్లుడు అనిల్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నారు.