మాచారెడ్డి/రాజంపేట్ ; కామారెడ్డి జిల్లాలో ఎన్నో ఆశలతో సాగు చేసిన యాసంగి పంటలు సాగునీళ్లు లేక వాడిపోతున్నాయి. బావులు అడుగంటి, బోర్లు ఎత్తిపోయి పొలాలు ఎండి పోతున్నాయి. మాచారెడ్డి, రాజంపేట్, ఎల్లారెడ్డి తదితర మండలాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపుగా ఎదిగిన పైర్లు కండ్ల ముందే పశువులకు మేతగా మారడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
సాగు నీరులేక పశువులకు మేతగా
చండ్రుగొండ ; సాగునీరు లేని కారణంగా ఓ రైతు పుట్టెదు దుఃఖంలో మునిగిపోయాడు. తీరా పంట చేతికొచ్చే సమయానికి చుక్క నీరు కూడా అందని పరిస్థితి నెలకొనడంతో పశువులకు మేతగా పెట్టాడు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో శుక్రవారం ఈ చిత్రం కెమెరా కంటికి చిక్కింది.
నీళ్లు లేకపాయే.. పంట ఎండిపాయే..
ధన్వాడ ; నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం పాతపల్లి శివారులో రైతు వెంకటయ్య రెండెకరాలలో వేరుశనగ పంట సాగు చేయగా.. అర్ద ఎకరాలో వరి పంట వేశాడు. అయితే గ్రౌండ్ వాటర్ తగ్గి బోరు ఇంకిపోగా.. దీనికి తోడు కరెంట్ కోతలతో పంట ఎండుముఖం పట్టింది. చేసేది లేక గొర్రెలు, పశువులకు మేతగా వదిలేశాడు. –
రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు
గద్వాల ; రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత, బాధలేదని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు ఆరోపించారు. శుక్రవారం గద్వాల నియోజకవర్గ పరిధిలో నెట్టెంపాడు లిఫ్ట్ కింద 104 ప్యాకేజీ పరిధిలోని కొండాపురం, గువ్వలదిన్నె, వెంకటాపురం, ఈర్లబండ, గంగన్పల్లి, ఇర్కిచెడ్ గ్రామాల పరిధిలో ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలకు నీరు అందుతాయనే ఆశతో రైతులు పంటలు సాగు చేశారని ప్రస్తుతం పంటలు చేతికి వచ్చే దశలో చివరి ఆయకట్టు వరకు నీరు రాక పోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు.
మా నోట్లో మట్లికొట్టొద్దు
ఇల్లంతకుంట రూరల్ ; కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం విశ్వాసం ఉన్నా రైతుల నోట్లో మట్టికొట్టొద్దు.. వెంటనే రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే ఎల్ఎం6 కెనాల్ పనులు ప్రారంభింభించండి.. అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో రైతులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష ఐదో రోజుకు చేరుకున్నది. రిలే దీక్షలో భాగంగా శుక్రవారం రైతులు గొంతులపై కొడవళ్లు పెట్టుకుని నిరసన తెలిపారు.