ఈ చిత్రంలో కన్పిస్తున్న ఈయన గడ్డం ప్రసాద్, మ్యాక్స్ సొసైటీ నిర్వాహకుడు. ఈయనది సిరిసిల్లలోని చంద్రంపేట కార్మిక క్షేత్రం. ఆయన మ్యాక్స్ సొసైటీ ఏర్పాటు చేసుకొని, ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించి వస్ర్తోత్పత్తి చేస్తున్నాడు. మరో 20మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటుచేసిన యారన్ బ్యాంకు నుంచి అందరికీ యారన్ అందిస్తామని చెప్పడంతో ఆయన కూడా మొదట్లో యారన్ తీసుకున్నాడు. కానీ, 2025లో నష్టపోయాడు. పాలిస్టర్ వస్త్ర తయారీకి సంబంధించి నూలు కోసం డీడీలు కట్టి ఎదురు చూశాడు. ఆలస్యంగా యారన్ అందడంతో అప్పటికే ఆర్డర్ల గడువు ముగిసింది. దీంతో లక్ష్యం మేరకు ఉత్పత్తి చేయలేకపోయాడు. తర్వాత యారన్ బ్యాంక్‌లో కొందరికే ఇస్తామని ఈయన్ను పక్కన పెట్టారు. మొదట 120మందిని, తర్వాత 60మందినే ఎంపిక చేశారు. ప్రస్తుతం 25 మ్యాక్స్ సొసైటీలను ఎంపిక చేశారు. చేసేదేమీ లేక ప్రసాద్ యథావిధిగా హైదరాబాద్ నుంచి వచ్చే ఏజెంట్ వద్దనే పాత లెక్కనే యారన్ కొనుగోలు చేసి ప్రస్తుతం వస్ర్తోత్పత్తి చేస్తున్నాడు.
రాజన్న సిరిసిల్ల, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆగమవుతున్నది. బతుకమ్మ చీరలను బంద్ పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు నూలు అందించడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నది. వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో కాకుండా.. వేములవాడలో టెస్కో ఆధ్వర్యంలో యారన్ డిపో (నూలు బ్యాంక్) ఏర్పాటు చేయడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. యారన్ సమయానికి అందివ్వక పోవడంతోపాటు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వస్ర్తోత్పతి నిలిచిపోతున్నది. దీంతో వస్ర్తోత్పత్తిదారులు, మ్యాక్స్ సొసైటీల నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.దీని ప్రభావం నేతన్నలపై పడి ఉపాధి దెబ్బతింటున్నది.
కాంగ్రెస్ హయాంలో అందని యారన్
నేతన్నలున్న సిరిసిల్లలో కాకుండా ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ నియోజకవర్గం వేములవాడలో ప్రభుత్వం యారన్ డిపో ఏర్పాటు చేసింది. మరమగ్గాలు, చేనేత సహకార సం ఘాల కోసం పెట్టిన ఈ డిపోను టెస్కో నిర్వహిస్తున్నది. దీన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించడం గమనార్హం. ప్రభుత్వ ఆర్డర్లకు 10 శాతం చెల్లింపుతో, 90శాతం క్రెడిట్‌పై యార న్ అందించడం ఈ డిపో ఉద్దేశం. 90శాతం క్రెడిట్‌ను బిల్లులు విడుదలయ్యాక, వాటిని ఆ బిల్లులో కట్ చేసుకొని, మిగతా బిల్లులను నే తన్నలకు చెల్లించాలి. డిపోను వేములవాడలో ఏర్పాటు చేయడం, సకాలంలో యారన్ ఇవ్వకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మ్యాక్స్ సొసైటీ నిర్వాహకులు, యజమానులు, ఆసాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యారన్ కోసం డీడీలు కట్టి వేచిచూడాల్సి వ స్తున్నదని, రవాణా భారం అదనంగా పడుతున్నదని వాపోతున్నారు. నూలు సాయం సమయానికి అందక, బయట అధిక ధరలు పెట్టలేక ఆర్డర్ల వస్ర్తోత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతున్నదంటున్నారు. పెట్టుబడి సైతం లేక ఆసాములకు లబ్ధి చేకూరకుండా పోతున్నదని వి చారం వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిన వస్ర్తోత్పత్తి
ప్రభుత్వ ఆర్డర్లు ఖరారయ్యాక టెస్కో ఆధ్వర్యంలో నూలు కొనుగోలుకు టెండర్లు పిలుస్తారు. అందులో అవకాశం దక్కించుకున్న సంస్థల ప్రతినిధులు మాత్రమే యారన్ డిపోకు నూలు సరఫరా చేస్తున్నారు. వస్ర్తోత్పత్తిదారులు తయారు చేసిన వస్ర్తాన్ని టెస్కోకు అందిస్తే, యారన్ 90 శాతం బిల్లును మినహాయించుకొని మిగతా డబ్బులను తిరిగి చెల్లిస్తుంది. ఇప్పటివరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతోపాటు ఇటీవల మళ్లీ ఇందిర మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇచ్చినప్పటికీ యారన్ ఇవ్వకపోవడంతో చీరల తయారీ నిలిచిపోయింది. మే నెలలో ఆర్డర్లు ఇచ్చిన సర్కార్ జూలై 31వరకు గడువు ఇచ్చింది. ఇప్పటివరకు సరిపడా నూలు అందకపోవడంతో వస్ర్తోత్పత్తిదారులు, మ్యాక్స్ సొసైటీల నిర్వాహకులు దిక్కులు చూస్తున్నారు. ఇదిలావుండగా యారన్ డిపోలో యారన్ కిలోకు అధికంగా రూ.30 వరకు ధర ఉండటంతో కొందరు యజమానులు ఇతర మార్కెట్లలో కొనుగోలు చేసి వస్ర్తోత్పత్తి చేస్తున్నారు. కానీ, చిన్న, మధ్య తరహా ఆసాములు యారన్ అందక చీరల తయారీని చేయలేకపోతున్నారు. నూలు బ్యాంక్ ఏర్పాటు చేసినప్పటికీ సిరిసిల్ల నేతన్నలకు ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో యారన్ బ్యాంక్ నిరుపయోగంగా మారింది. ప్రభుత్వ ఆర్డర్లకే యారన్ డిపో నుంచి నూలు అందించాల్సి ఉన్నా.. అది కూడా అందుబాటులో లేదు. బహిరంగ మార్కెట్లో యారన్ రేటు అమాంతం పెరుగడం, యారన్ డిపో నుంచి నూలు అందకపోవడంతో వస్రోత్పత్తి ముందుకు సాగడం లేదు.
కేసీఆర్ హయాంలో సిరులఖిల్లాగా..
కేసీఆర్ పాలనలో అప్పటి చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ కృషితో సిరిసిల్ల సిరులఖిల్లాగా మారింది. ఎన్నో సంక్షేమ పథకాలు, రుణాలు, చేతినిండా పనితో నేతన్నలకు భరోసా దొరికింది. ప్రభుత్వ ఆర్డ ర్లు, బతుకమ్మ చీరల తయారీతో వస్త్ర పరిశ్రమ కళకళలాడింది. బతుకమ్మ చీరలకు సైతం నేతకార్మికులకు 10శాతం యారన్ సబ్సిడీని అందించింది. కార్మికుడు నేసిన ప్రతిమీటర్ బట్టకూ రూ.1.42 పైసలు అందించి అండగా నిలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ప్రభుత్వం నేతన్నలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. వచ్చీ రాగానే కేటీఆర్‌పై అక్కసుతో ప్రభుత్వ ఆర్డర్లు, బతుకమ్మ చీరల తయారీని నిలిపివేసింది. ఏడాదిన్నరపాటు పనులు లేక తీవ్ర ఇబ్బందుల్లో పరిశ్రమ సంక్షోభంలో చిక్కింది. ఆర్థిక ఇబ్బందులు, చేతినిండాపనులు లేకపోవడంతో సుమారు 15 మంది నేతకార్మికులు సైతం ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కార్మిక సంఘాల నాయకులు ఒత్తిడి, నేతల ఆందోళనలతో ప్రభుత్వం అనివార్యంగా అరకొర ఆర్డర్లు ఇచ్చింది. ఇందిరా మహిళా శక్తి ఆర్డర్లు అందించింది. రూ.50 కోట్ల కార్పస్ ఫండ్‌తో ప్రభుత్వ ఆర్డర్లకు నూలు సాయం అందించేందుకు 2024 నవంబర్‌లో వేములవాడలో తెలంగాణ రాష్ట్ర చేనేత, మరమగ్గాల పారిశ్రామికుల సహకార సంఘం లిమిటెడ్ (టెస్కో) ఆధ్వర్యంలో యారన్ డిపోను సైతం ఏర్పాటు చేసింది. ఏడాది గడిచిందో లేదో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇచ్చిన ప్రభుత్వ ఆర్డర్లను రద్దు చేసింది. కమీషన్లకు కక్కుర్తిపడి టెండర్ల ద్వారా వస్ర్తాల సేకరణ చేసేందుకు మొగ్గుచూపింది. ఇటీవలే మళ్లీ రెండో విడత ఇందిరా మహిళ శక్తి చీరల తయారీ ఆర్డర్లను ఇచ్చింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇచ్చిన ఆర్డర్లకు యారన్ డిపో నుంచి నూలు అందక, చీరల తయారీ సందిగ్ధంలో పడింది. మొదటి విడత అందించిన చీరల తయారీ ఈ ఏడాది జూలై 31 వరకు పూర్తి చేయాల్సి ఉన్నా నూలు సాయం అందక ఉత్పత్తి ముందుకుసాగడం గగనంగా మారింది.