CM Revanth Reddy | ఆత్మకూరు(ఎం), జూలై 15: సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు యాల యాదిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి గుర్తింపు పొందిందని గుర్తుచేశారు. నేడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా సీఎం రేవంత్రెడ్డి భాషతీరుతో ప్రజలు విసుగెత్తిపోతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్రెడ్డి బజారు భాష మాట్లాడుతూ.. పార్టీ ఇజ్జత్ తీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏఒక్క పథకాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసంచేయడం సరికాదని హితవుపలికారు. సీఎం రేవంత్రెడ్డి ఏకపక్షంగాపరిపాలన సాగిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోవడం ఖాయమని స్పష్టంచేశారు. ఇప్పటికైనా అధిష్ఠానం ఆలోచించి పార్టీని కాపాడే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని సూచించారు.