హైదరాబాద్, జూన్ 23 (నమస్తేతెలంగాణ)/ సుల్తాన్‌బజార్, జూన్ 23 : గొల్ల, కురుమల సామాజిక వర్గ శాసనసభ్యులకు క్యాబినెట్ పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది. పోరాట సమితి ఆధ్వర్యంలో గొల్ల, కురుమలు సోమవారం ఉదయం గాంధీభవన్‌లో డీసీఎంలో గొర్రెలను తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇక్కడ సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ మాట్లాడుతూ గొల్ల, కురుమల సామాజిక ఎమ్మెల్యేలకు వెంటనే మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని, రూ.10 వేల కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు.
గొర్రెల పెంపకానికి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రూ.2 లక్షలు ఇస్తామని మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా హామీలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. గొల్ల, కురుమల సంక్షేమాన్ని కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. గొల్ల, కురుమలను మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం తమ సామాజిక వర్గానికి అగౌరవంగా భావిస్తున్నట్టు తెలంగాణ గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్, ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 50 ఏండ్లు నిండిన ప్రతి గొర్రెల కాపరికి 6 వేల పెన్షన్ అందించాలని, ఎక్స్‌గ్రేషియాను 10 లక్షలకు పెంచాలని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 కోట్లు ఉన్న ఎన్సీడీసీ రుణాలను వెంటనే మాఫీ చేయాలని, మూగజీవాలకు ఇన్సూరెన్స్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
భారీగా ట్రాఫిక్ స్తంభన
గాంధీ భవన్ ప్రాంగణంలో గొర్రెలు తిరుగుతూ, నిరసనకారుల నినాదాలతో పరిస్థితి గందరగోళంగా మారింది. గాంధీభవన్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పార్టీ కార్యాలయంలో సమావేశాలకు ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హాజరవుతారని తెలిసి సమితి ప్రతినిధులు ఆమెకు వినతిపత్రం అందించాలని భావించారు. కాగా రాకముందే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ వచ్చి విషయాన్ని పార్టీ ఇన్చార్జి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. విషయం తెలిసి పోలీసులు రంగంలోకి దిగి గొర్రెలను, ఆందోళన కారులను వాహనాల్లో తరలించారు. నిరసనలో గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాయకులు అయోధ్య యాదవ్, జీ హరికృష్ణ యాదవ్, ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, మేకల వెంకటేశ్ యాదవ్, ఎం నాగరాజు, మేకల శ్రీశైలం యాదవ్, డీ సత్యనారాయణ, రమేశ్ కురుమ, పాక వెంకటేశ్, యాదయ్య, మల్లేశ్ కురుమ, మహేందర్ యాదవ్ పాల్గొన్నారు.
గొల్ల, కురుమలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, తమ సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది. సోమవారం ఉదయం గాంధీభవన్‌కు డీసీఎం నిండా గొర్రెలను తీసుకొచ్చి నిరసన చేపట్టారు. క్యాబినెట్లో ప్రాతినిధ్యంతోపాటు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. దీంతో గాంధీభవన్ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి గొర్రెలను, ఆందోళనకారులను అక్కడినుంచి తరలించారు.