యాదగిరిగుట్ట : స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ఆదివారం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. భక్తుల రాకతో మాఢవీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు సందడిగా కనిపించాయి. ధర్మ దర్శనానికి 4గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రతమండపం, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు స్వామివారి దర్శనాలు(Darsanam) కొనసాగాయి. స్వామివారికి నిత్యోత్సవాలను అర్చకులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవను,తిరువారాధన నిర్వహించి ఆరగింపు చేపట్టారు.
స్వామివారికి నిజాభిషేకం, ఉదయం, సాయంత్రం సహస్రనామార్చన (Sahasranamarchana), అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్భార్ సేవను నిర్వహించామని ఆలయ ఈవో ఎన్.గీత వెల్లడించారు.