Yadadri | యాదగిరిగుట్ట : నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి జయంత్యుత్సవాలను మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు వేడుకలను కనుల పండువలా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో గీత తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 2న ఉదయం 9.30 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరణం, కుంకుమార్చన,
తిరు వెంకటపతి అలంకార సేవ నిర్వహించనున్నారు. సాయంత్రం 6గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం నిర్వహించి, గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ చేపట్టనున్నారు.
3న ఉదయం 9.30 గంటలకు నిత్యమూలమంత్ర హవనం, లక్షపుష్పార్చన, కాళీయమర్ధన అలంకార సేవ, సాయంత్రం నృసింహ మూలమత్ర హవనం, హనుమంత వాహనంపై రామావతారం అలంకారసేవ జరుగనున్నది. 4న ఉదయం 7గంటలకు స్వామివారి ప్రధానాలయంలో మూలమస్తృ హవనం, ఉదయం 9నుంచి 9:30 గంటల వరకు మహాపూర్ణాహుతి అనంతరం సహస్ర కలశాభిషేకం, సాయంత్రం 7గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించి ఉత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు.
స్వామివారి జయంత్యుత్సవాల సందర్భంగా ఆలయంలో జరిగే ఆర్జిత సేవలైన సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత తిరుకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలను నిలిపివేస్తున్నట్లు ఈఓ వివరించారు. దీంతోపాటు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, జనగామ జిల్లాలోని దబ్బగుంటపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారి జయంత్యుత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు.