యాదాద్రి, నవంబర్ 6 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. కార్తీక మాసం రెండో ఆదివారం కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణిలో భక్తుల సందడి నెలకొన్నది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించారు.
తిరుమాడ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు భక్తులతో రద్దీగా మారాయి. యాదాద్రీశుడి ధర్మ దర్శనానికి 6 గంటలు, వీఐపీ దర్శనానికి 4 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధనలో భారీగా పాల్గొన్నారు. కొండకింద పార్కింగ్ ప్రాంగణమంతా కార్లు, ద్విచక్ర వాహనాలతో నిండిపోయింది.
దేవాలయ చరిత్రలో ఆదివారం రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. ఎన్నడూలేని విధంగా స్వామివారిని సుమారు 82 వేల మంది భక్తులు దర్శించుకోగా, అన్ని విభాగాలు కలుపుకొని రూ.85,62,851 ఆదాయం వచ్చినట్టు ఈవో గీత తెలిపారు.