యాదగిరిగుట్ట, మార్చి 1 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక, నవాహ్నిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్రాగమశాస్త్రయుక్తంగా ప్రారంభించారు. శనివారం స్వయంభూ ప్రధానాలయంలో ప్రభాతవేళ నిత్యపూజ కైంకర్యాల అనంతరం స్వామివారి అనుమతితో వైశేక హోమాలు, ప్రత్యేక తిరుమంజనం జరిపారు. బ్రహ్మోత్సవం నిర్విఘ్నంగా కొనసాగాలని ఉదయం 10:05 గంటలకు ఉత్సవాల ప్రారంభానికి ముందుగా గర్భాలయంలో స్వయంభువుగా వెలిసిన స్వామివారి నుంచి ఉత్సవాల నిర్వహణకు అనుమతిని స్వీకరించారు.
ప్రధానాలయ ముఖచమండపంలో స్వామివారి ఆస్థానంలో వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, నవకలాభిషేకం, స్వస్తివాచనం, రక్షాబంధనం, మంత్రపుష్ప నీరాజనాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం పూజలు నిర్వహించారు. ఆదివారం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం, హవనం తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు.