Rajpal Yadav | బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌కు భారీ షాక్ తగిలింది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న చెక్ బౌన్స్ కేసులో ఆయన ఎట్టకేలకు ఢిల్లీలోని తిహాడ్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. గత కొన్నేళ్లుగా చెక్ బౌన్స్ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురుకాగా, ఈ నెల 2వ తేదీనే లొంగిపోవాలని గతంలో కోర్టు ఆదేశించినప్పటికీ ఆయన గడువు కోరారు. అయితే న్యాయస్థానం ఇందుకు నిరాకరిస్తూ తక్షణమే లొంగిపోవాలని ఆదేశించడంతో గురువారం సాయంత్రం ఆయన జైలు అధికారుల ముందు సరెండర్ అయ్యారు.
అసలేం జరిగింది.
మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి రాజ్‌పాల్ యాదవ్ దంపతులు గతంలో భారీ మొత్తంలో అప్పు తీసుకోగా, ఆ బాకీని తీర్చడానికి వారు ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ కావడంతో సదరు సంస్థ న్యాయపోరాటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో 2018లో ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి 6 నెలల జైలు శిక్ష విధించగా, 2019లో సెషన్స్ కోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది. 2024లో హైకోర్టు శిక్షపై స్టే ఇస్తూ బాకీ చెల్లించాలని సూచించినప్పటికీ, రాజ్‌పాల్ యాదవ్ ఆ హామీని నెరవేర్చడంలో విఫలమవ్వడంతో కోర్టు కఠినంగా వ్యవహరించి శిక్షను అమలు చేయాలని తుది ఆదేశాలు జారీ చేసింది.
బాలీవుడ్లో ‘భూల్ భూలయ్య’, ‘హంగామా’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌పాల్ యాదవ్, తెలుగులో రవితేజ నటించిన ‘కిక్ 2’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు.