Yadagirigutta | యాదగిరిగుట్ట, మార్చి 26: ‘ఏయ్ ఏమనుకుంటున్నవ్.. టంగ్ కంట్రోల్ చెయ్.. నేను ఆఫీసర్‌ను’ అంటూ యాదగిరిగుట్ట ఏసీపీ రమేశ్‌కుమార్.. పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులపై దురుసుగా ప్రవర్తించారు. ‘ఇది పోలీస్‌స్టేషన్.. గుంపులుగా పార్టీ కండువాలు వేసుకుని వస్తారా’ అంటూ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ ముక్యర్ల మల్లేశ్‌తోపాటు ఆ పార్టీ నాయకులు తమను నిందించడంతోపాటు బట్టలుడదీసి కొడుతామని వ్యాఖ్యలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య పార్టీ శ్రేణులతో కలిసి బుధవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సీఐ రమేశ్‌ను కలిసి ఫిర్యాదు చేసి సమస్యను వివరిస్తుండగా, ఏసీపీ రమేశ్‌కుమార్ జోక్యం చేసుకున్నారు.
‘ఫిర్యాదు ఇచ్చి వెళ్లండి.. ఇంతమంది రావద్దు’ అంటూ హుకూం జారీ చేశారు. ‘ఈ రోజు అసెంబ్లీలో ముఖ్యమైన రోజు’ అంటూ అక్కడి పరిస్థితికి సంబంధం లేని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తూ.. మేం ఫిర్యాదు చేసేందుకే వచ్చాం.. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఫిర్యాదును వివరిస్తున్నాం అని బదులివ్వడంతో ఏసీపీ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘నోరు మూసుకోండి’ అంటూ చేతులతో సైగలు చేశారు. ‘ఇది పోలీస్ స్టేషన్.. మీ ఇష్టం వచ్చిన్నట్టు మాట్లాడొద్దు’ అంటూ హెచ్చరించారు. దీంతో విసిగిపోయిన బీఆర్ఎస్ శ్రేణులు మీరు పోలీస్ అధికారిగా ప్రవర్తించడం లేదు.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మండిపడటంతో అక్కడి నుంచి తన చాంబర్లోకి వెళ్లిపోయారు.
ఏసీపీని సస్పెండ్ చేయాలి: బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వస్తే దురుసుగా ప్రవర్తించిన ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏసీపీ రమేశ్‌కుమార్ ప్రభుత్వాధికారిగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫిర్యాదును స్వీకరించిన పట్టణ సీఐ రమేశ్ సర్దిచెప్పేందుకు యత్నించినా పట్టించుకోకుండా అడ్డగోలుగా ప్రవర్తించారని వాపోయారు. త్వరలో డీసీపీ, సీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.