యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో శనివారం భక్తుల సందడి కొనసాగింది. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో బాలాలయంతో పాటు ఆలయ పురవీధుల్లో సందడి నెలకొంది. శ్రావణమాసం కావడంతో సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని తరించారు. భక్తిశ్రద్ధలతో వ్రతమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. యాదాద్రీశుడి నిత్య ఆరాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు జరిపారు.
ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి ముఖ మండపంలో కల్యాణ తంతు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, అంజనేయ స్వామి వారికి సహస్రనామార్చన చేశారు.