హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) వచ్చే ఏడాదే పూర్థిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్లాంట్ నుంచి మన రాష్ట్రం పూర్తిస్థాయి విద్యుత్తును వాడుకునే వీలుంటుంది. ప్లాంట్‌లోని మొత్తం యూనిట్లు ఇప్పుడే అందుబాటులోకి రావని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) తేల్చింది. ప్రస్తుతం ఒక యూనిట్లో విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుండగా, మిగిలిన నాలుగు యూనిట్లు జనవరి 2026 కల్లా అందుబాటులోకి వస్తాయని స్పష్టంచేసింది. యాదాద్రి విద్యుత్తు ప్లాంట్ విద్యుత్తు కొనుగోలు వ్యయాన్ని రూ.8,951 కోట్లకే ఈఆర్సీ అనుమతించింది. డిస్కంలు రూ. 10,770 కోట్ల అంచనాలు సమర్పిస్తే ఈఆర్సీ రూ. 1,819 కోట్లకు కోతపెట్టింది.
10 వేల కోట్లకు ప్రతిపాదనలు
డిస్కంలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈఆర్సీకి సమర్పించిన అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ అండ్ రిటైల్ సప్లయ్ బిజినెస్ టారిఫ్ ప్రతిపాదనల్లో వైటీపీఎస్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేస్తామని ప్రతిపాదించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 19,960 మిలియన్ యూనిట్లు విద్యుత్తు వస్తుందని, నష్టాలు, ప్లాంట్ అవసరాలు పోను, 16,800 మిలియన్ యూనిట్లు విద్యుత్తును డిస్పోజ్ చేయవచ్చని టీజీఎస్పీడీసీఎల్ అంచనా వేసింది. ఏప్రిల్ నెలలో 1,036, మేలో 1,427, ఇలా నెలకు కొంత పెరుగుకుంటూ చివరికి 2026 మార్చిలో 1,784 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వస్తుందని సంస్థ ఈఆర్సీకి సమర్పించిన నివేదికలో తెలిపింది. ఈ విద్యుత్తు కొనుగోలుకు ఫిక్స్డ్ చార్జీలు, వేరియబుల్ చార్జీలు, ఇతర చార్జీలు కలిపితే మొత్తంగా రూ.10, 770 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. దీంట్లో ఫిక్స్డ్ చార్జీలు
రూ. 4,838 కోట్లు, వేరియబుల్, ఇతర చార్జీల కింద రూ. 5,932 కోట్లకు అనుమతించాలని ఈఆర్సీని కోరింది.
ఈఆర్సీ ఎంతకు అనుమతిచ్చిందంటే..
విద్యుత్తు సంస్థలు అంచనా వేసినంత విద్యుత్తు వైటీపీఎస్ నుంచి తీసుకోవడం కష్టమని ఈఆర్సీ తేల్చింది. ప్రస్తుతం వైటీపీఎస్‌లో ఒక యూనిట్ మాత్రమే నడుస్తున్నది. మిగతా యూనిట్లు ఆలస్యంగా ప్రారంభమవుతాయని ఈఆర్సీ పరిశీలనలో తేలింది. మొత్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో యాదాద్రి నుంచి 14,184 మిలియన్ యూనిట్లు విద్యుత్తు మాత్రమే తీసుకునే అవకాశముందని ఈఆర్సీ తేల్చింది. ఇందుకు రూ. 8,951.95 కోట్లకు అనుమతినిచ్చింది. దీంట్లో ఫిక్స్డ్ కాస్ట్ రూ. 4,090.47 కోట్లు కాగా, వేరియబుల్ కాస్ట్ రూ.4,861.49 కోట్లుగా ప్రకటించింది. మేలో 506, జూన్‌లో 490, జూలైలో 506 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మాత్రమే తీసుకునే వీలుందని ఈఆర్సీ అంచనావేసింది.
యూనిట్ల వారీగా యూనిట్లు ప్రారంభమయ్యే అంచనా