
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): వచ్చే నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదటివారంలో యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆధునిక కాలంలో ఎవరూ నిర్వహించని విధంగా చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సుదర్శన మహాయాగం నిర్వహించి ఆలయాన్ని పునఃప్రారంభిస్తామని శుక్రవారం అసెంబ్లీలో వెల్లడించారు. ఆలయ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించామని చెప్పారు. ప్రపంచమే నివ్వెరపోయేలా యాదాద్రి ఆలయ నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర రాష్ర్టాల ప్రముఖులు ఆలయాన్ని సందర్శించి, గొప్పగా ప్రశంసిస్తున్నారని సీఎం చెప్పారు.
ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు
రాష్ట్రంలో ఆధ్యాత్మికతను పెంపొందించే క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు పెట్టుకొంటున్నామని కేసీఆర్ తెలిపారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో నంది పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్, అన్నపూర్ణ రిజర్వాయర్.. ఇలా కింది నుంచి పైవరకు దేవుళ్ల పేర్లు పెట్టినం. ప్రపంచంలోనే అత్యద్భుతమైన సమతామూర్తి రామానుజుల వారి విగ్రహం ముచ్చింతల్లో ఏర్పాటవుతున్నది. 108 దివ్యదేశాలతో ప్రపంచంలోని వైష్ణవులందరూ దర్శించుకునేలా స్వామివారి పుణ్యక్షేత్రం నిర్మాణమవుతున్నది’ అని సీఎం కీర్తించారు.