శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 15:01:41

యాదాద్రిని గుడుంబా రహిత జిల్లాగా మార్చాలి

యాదాద్రిని గుడుంబా రహిత జిల్లాగా మార్చాలి

యాదాద్రి భువనగిరి : జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు. స్థానిక ఆర్అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా కొనసాగించేందుకు మద్యం అక్రమ రవాణా, కల్తీ మద్యాన్ని పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

గంజాయి రవాణా జిల్లాలో పూర్తిగా నిర్మూలించేందుకు రైళ్లలో అక్రమ రవాణపై నిఘా ఉంచాలన్నారు. మద్యం షాపుల వద్ద కరోనా నిబంధనలను పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణకు హరితహారం కింద తాటి, ఈత వనాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీరా పాలసీ కింద తాటి చెట్లను, తాటి ఉత్పత్తులను పూర్తిస్థాయిలో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.


గీత కార్మికులకు 50 సొసైటీలకు అందించిన భూమిని తాటి, ఈత వనాలను  మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ మద్యం  కేసును పట్టుకున్న భువనగిరి సీఐ నాగిరెడ్డిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, అడిషనల్ కలెక్టర్ కీమ్యా నాయక్ ఎక్సైజ్ అధికారులు విష్ణు ప్రియ, డిప్యూటీ కమిషనర్ నల్గొండ అంజలి రావు పాల్గొన్నారు.