
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంపై మీ అభిప్రాయం?
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభువు. చిన్నతనం నుంచి స్వామి దర్శనానికి వెళ్లేవాణ్ణి. పాదయాత్రగా వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఈ క్షేత్రం మన దగ్గర ఉండటం మన భాగ్యం. దీనిని పునర్నిర్మాణం చేసుకోవడం, సమున్నత రీతిలో సర్వోన్నత దేవాలయంగా ప్రభుత్వం తీర్చిదిద్దటం ఆనందదాయకం. తరతరాలు మెచ్చే శిల్పశాస్త్రం, ఆ గోపుర నిర్మాణశైలి అద్భుతం. అన్ని రకాల హంగులు, ఆర్భాటాలు చూపిస్తూ ఆలయాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకోవడం సంతోషకరం. ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేయాలనే ఆలోచన పాలకులకు రావటం పరమాత్మ అనుగ్రహమే.
భక్తితత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
భగవంతుని వద్దకు రకరకాల భక్తులువస్తుంటారు. జ్ఞానులు, కోరికలున్నవారు, దేవుడంటే ఏమిటో తెలుసుకోవాలనుకొనేవారు, ఏమీ తెలియనివారు వస్తారు. ఈ నాలుగు రకాల భక్తులకు ఏకకాలంలో వారివారి కోరికలు తీర్చే సామర్థ్యం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిలో పరిపూర్ణంగా ఉన్నది. స్వామివారు శక్తి ఆవేశ అవతారం. పిలిస్తే పలుకుతాడు, పిలువనంత సేపు చూస్తుంటాడు. ఇది ప్రహ్లాద చరిత్ర చెప్పే సత్యం. పిలిస్తే పలికే స్వభావమున్న ఆ స్వామిని తలుచుకోవడమే మన కర్తవ్యం.
యాదాద్రి పునర్నిర్మాణంలో భక్తుల భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి?
భక్తులు చాలాకాలం నుంచి యాదాద్రి ఆలయంలో, బాలాలయంలో దర్శనం చేసుకొంటున్నారు. ప్రధానాలయంలో ఉన్న మూర్తిని ఎప్పుడు చూద్దామా అనే ఆత్రుతతో ఉన్నారు. దీనిని గమనించే భగవంతుడు తన దర్శనమివ్వడానికి తేదీలు నిర్ణయించినాడు. భక్తులు గతం కంటే కొన్ని వేల రెట్లుగా, ఉత్సాహంగా పరమాత్మునికి అంకితం కాబోతున్నారు. పరమాత్మునికి కైంకర్యాలు చేయటానికి, తమ శక్తిసామర్థ్యాలు అనుసరించి, తను, ధన, మనములతో సేవ చేయడానికి ప్రతి గ్రామం నుంచి ప్రజలు సంసిద్ధులై ఉన్నారు. వారందరికీ స్వామి అనుగ్రహం లభిస్తుంది.
ఆలయ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాత్రను ఎలా చూస్తారు?
రూ.వందల కోట్లతో యాదాద్రి పునర్నిర్మాణం చేయాలన్న ఆలోచన పాలకులకు కలగటం పరమాత్మ అనుగ్రహం. మన అదృష్టం. యాదాద్రి మాదిరిగా మిగతా క్షేత్రాలను కూడా మున్ముందు విస్తరించేటువంటి అవకాశం ప్రభుత్వం తీసుకొంటుందని భావిస్తున్నాం. యాదాద్రి పునర్నిర్మాణం ప్రారంభమయ్యాక నేను చాలాసార్లు వెళ్లాను. నేను గమనించింది ఏమిటంటే పాలకుల దగ్గర నుంచి కార్మికుని వరకు అంకితభావంతో పనిచేశారు.
యాదాద్రి ప్రభావం ఎలా ఉండబోతున్నది?
భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు అతీతమైనది ఆలయం. అలాంటి ఆలయమే యాదాద్రి. ప్రపంచంలో మరెన్నో దేవాలయాల పునర్నిర్మాణానికి యాదాద్రి చక్కని ఉదాహరణ కాబోతున్నది. ఇక్కడి కృషి, శిల్పనిర్మాణ చాతుర్యం, పూజా విధానం, ఆచార వ్యవహారాలు, మొక్కుబడులు, అనేక రకాల వ్యవస్థలు, సౌకర్యాలను ప్రపంచంలోని ఎన్నో దేవాలయాలు ఉదాహరణగా తీసుకొంటాయి.