యాదాద్రి భువనగిరి, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : లారీ నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ కోసం 5 వేల రూపాయలు లంచం(bribe) తీసుకుంటూ యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) రవాణా శాఖ అధికారి సురేందర్‌రెడ్డి ఏసీబీ( ACB)కి పట్టుబడ్డారు. ఈ కేసులో ఆయనతోపాటు మరో ఇద్దరు ఏజెంట్లను ఏసీబీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ)గా సురేందర్‌రెడ్డి ఎనిమిదేండ్ల నుంచి పని చేస్తున్నారు.
భూదాన్‌పోచంపల్లి మండలానికి చెందిన ప్రవీణ్ కుమార్ లారీ (ఏపీ 16 టీ6646) నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. లంచం ఇస్తేనే పర్మిట్ క్యాన్సిల్ చేస్తానని డీటీఓ డబ్బు డిమాండ్ చేశారు. దాంతో ప్రవీణ్ కుమార్ ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం ప్రవీణ్‌కుమార్ రూ.5వేలు తీసుకొని భువనగిరి జిల్లా రవాణా కార్యాలయానికి చేరుకున్నాడు.
ఆ డబ్బును ఆర్టీఏ ఏజెంట్లు సురేశ్, అనిల్‌కు అప్పగించాలని డీటీఓ సూచించడంతో వారికి అందించాడు.
ఈ క్రమంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీటీఓతోపాటు ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్ చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో సంబంధం ఉన్న ఏ2 మల్లికార్జున్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారు. కాగా, హైదరాబాద్ హబ్సిగూడలో నివాసం ఉంటున్న సురేందర్‌రెడ్డి ఇంట్లో కూడా దాడులు చేసినట్లు ఏసీబీ నల్లగొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.