హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో చరిత్ర పూర్వయుగం ఆనవాళ్లను, శాతవాహన కాలంనాటి పురా వస్తువులను గుర్తించారు. కొలనుపాకలోని పీతాంబరం వాగు ఒడ్డున ‘గుడిగడ్డ’గా పిలిచే మిట్టపల్లి భాసర్ వ్యవసాయ భూమిలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు జరిపిన పరిశోధనల్లో తాజాగా ఇవి బయటపడ్డాయి. పురా వస్తువుల్లో కొత్త రాతియుగం 6 వేల ఏండ్లనాటి వడిసెల రాయి, పెద్ద రాతియుగం (4వేల ఏండ్లు) నాటి నలుపు, ఎరుపు (బ్లాక్ అండ్ రెడ్వేర్), తొలి చారిత్రక యుగాల నాటి (2 వేల ఏండ్లు) నలుపు (బ్లాక్ అండ్ వేర్), ఎరుపు (రెడ్ వేర్) కుండల పెంకులు, శాతవాహన కాలానికి చెందిన విరిగిన టెర్రకోట బొమ్మ, పూసలు, నగదుగా చలామణి అయిన (విష్ణుకుండినుల కాలపు) గవ్వ (కౌరి), నూరుడు రాళ్లు, దంపుడు రాళ్లు, సాన రాళ్లు, విసుర్రాయి పైభాగం, కుప్పలుగా కుండ పెంకులు లభించాయి. పొరుగు గ్రామమైన లక్ష్మకపల్లెలో కూడా పెద్ద రాతియుగం సమాధులను చరిత్ర బృందం గుర్తించింది. పోచన్నపేట దారిలో పెద్ద రాతియుగం సమాధులు ఉన్నట్టు సమాచారం ఉన్నదని బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, కుండె గణేశ్, ముడావత్ రవీందర్, మిట్టపల్లి భాసర్, మేఘరాజు, మంజుల, హర్షిత్, రిషిత తెలిపారు.