హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): నీట్ పేపర్ లీక్‌పై దేశమంతా, కాంగ్రెస్ అగ్రనేతలంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రశ్నిస్తుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం మోదీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్, ప్రధాని మోదీ వైఫల్యం ఉన్నదని దేశమంతా విమర్శిస్తుంటే.. రేవంత్ మాత్రం నీట్‌తో ఏమాత్రం సంబంధం లేని గ్లోబరీనా అనే కంపెనీ పేరును మధ్యలోకి తీసుకొచ్చి బీజేపీకి, మోదీకి రక్షకుడిగా మారిపోయారని మండిపడ్డారు. నీట్ పరీక్ష నిర్వహించేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థ అయితే, దాంతో కేటీఆర్‌కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఏ ర్యాలీలోనూ రేవంత్‌రెడ్డి కనిపించడం లేదని, మరి ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నట్టు? అని ప్రశ్నించారు.