హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన ఆటోమేటెడ్ టెస్టింగ్ కేంద్రాల టెండర్లను రద్దు చేయాలని కమిషనర్ ఆఫ్ టెండర్స్‌కు బీఆర్ఎస్ నేత, రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.600 కోట్లు వెనుకేసుకునే కుట్ర జరిగిందని పేర్కొన్నారు. అన్ని స్టేషన్ల పనులు ఒకరికే అప్పజెప్పే ప్రయత్నం జరుగుతున్నదని తాము గతంలోనే అనుమానం వ్యక్తంచేసినట్టు తెలిపారు. అయితే అదే జరిగిందని, ఓ మంత్రి తన దగ్గరి వ్యక్తికి టెండరు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడన్న విషయం తమ విచారణలో నిజమని తేలిందని పేర్కొన్నారు.
37 కేంద్రాల టెండరు ఒకరికే కట్టబెట్టారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రీ బిడ్డింగ్ మీటింగ్ లేకుండా, రెండుసార్లు టెండర్లను రద్దు చేసి.. వెంట వెంటనే నిబంధనల్లో సవరణలు చేయడం, ఆ తర్వాత కస్లర్లుగా మార్చి.. ఒకో క్లస్టర్‌కు ఒకోలా ధరలు నిర్ణయించడం.. ఇలా అనేక అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. దీనిపై న్యాయపోరాటానికి కూడా వెనుకాడబోమని తెలిపారు.