గ్రామపంచాయతీలుగా తండాలు.. ఎవరి తండాలకు వారే సర్పంచ్.. అటవీ ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్లు.. అటవీ ఉత్పత్తులకు గిరి బ్రాండ్.. పౌష్ఠికాహారానికి గిరిపోషణ్.. ఆదివాసీ సంస్కృతిని ప్రపంచానికి తెలియజెప్పే మ్యూజియం.. హైదరాబాద్లో ఆదివాసీ, బంజారా భవన్లు.. ఘనంగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. ఇలా అడవిబిడ్డల క్షేమం, సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ సర్కారు అన్ని వేళలా కృషిచేస్తున్నది. కొండకోనల మధ్య సాగుతున్న బతుకులకు వెలుగు దారులు చూపుతున్నది. ఫలితంగా అడవి బిడ్డల గుండెల్లో ప్రగతి గీతం ఆలపిస్తున్నది. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనుల అభ్యున్నతిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): అడవిబిడ్డల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఉపాధి, వైద్యసేవలకు ప్రాధాన్యత ఇస్తున్నది. సమ్మక్క-సారలమ్మ, నాగోబా, సేవాలాల్ మహరాజ్ జాతరలను ఘనంగా నిర్వహిస్తూ వారి సంస్కృతిని ప్రపంచానికి తెలియజేస్తున్నది. గోండువీరుడు కుమ్రంభీం నినదించిన జల్.. జంగల్.. జమీన్ నినాదానికి అనుగుణంగా అడవిబిడ్డలకు సాగునీరు అందిస్తూ, భూ సమస్యల పరిష్కారానికి శ్రమిస్తున్నది. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చింది. ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో జ్వరం వస్తేనే పిట్టల్లా రాలిపోయిన దుస్థితికి టీఆర్ఎస్ సర్కార్ చరమగీతం పాడింది. ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం వంటి మారుమూల అటవీ ప్రాంతాల్లోనూ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నది. అటవీ ఉత్పత్తులే జీవనాధారంగా బతికిన గిరిపుత్రుల చేత ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయించి, వారిని స్వయం ఉపాధి సారథులుగా మలిచింది. ఊట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏల పరిధిలో స్వయం సహాయక సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్లు తయారుచేస్తున్న అటవీ ఉత్పత్తులకు గిరిబ్రాండ్ పేరుతో మార్కెటింగ్ కల్పించింది. తద్వారా కొవిడ్ సమయంలోనూ (2020-21) దాదాపు రూ.250 కోట్ల టర్నోవర్ సాధించారు. వారి సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి తెలిసేలా మ్యూజియాన్ని నెలకొల్పింది. హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీ, బంజారా భవనాలను నిర్మించింది. అంతరించిపోతున్న ఆదివాసీ కళకు జీవం పోసి ఆ కళ ద్వారా యువతకు ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నది. గురుకుల విద్యాలయ సంస్థ ద్వారా వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నది. 22 డిగ్రీ కాలేజీల(ఇందులో 15 మహిళలవే)ను నెలకొల్పి ఉత్తమ విద్యా అవకాశాలను కల్పిస్తున్నది. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటేందుకు ప్రోత్సాహం అందిస్తున్నది. రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి.
స్వపరిపాలనలో తండాలు
ప్రత్యేక చట్టం ద్వారా 1,177 తండాలు, గోండు, కోయ గూడేలను రాష్ట్రప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా మార్చింది. రాష్ట్రంలో 1,281 ఆవాస ప్రాంతాలు షెడ్యూల్డ్ ఏరియాలో ఉండటంతో వాటిని ఎస్టీలకే రిజర్వ్ చేసి గిరిజన బిడ్డల్ని పాలకులను చేసింది. రాష్ట్రంలో మరో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వు చేసింది. దీంతో మొత్తంగా 3,146 మంది గిరిజన బిడ్డలు సర్పంచులుగా ఎన్నికయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేశంలో ఈ స్థాయిలో గిరిజనులకు రాజకీయ అధికారం కల్పించిన రాష్ట్రం మరొకటి లేదు.
గిరిపోషణ్లో తొలి రాష్ట్రంగా..
అటవీ ప్రాంతాల్లోని గిరిజన బిడ్డలు పౌష్ఠికాహారలోపంతో బాధపడుతున్నారని గ్రహించిన ప్రభుత్వం గిరిపోషణ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆరోగ్యలక్ష్మి పథకానికి అదనంగా ఇక్రిశాట్ రూపొందించిన పౌష్ఠికాహారాన్ని గిరిపోషణ్ కింద అందజేస్తున్నది. ముందుగా కొండరెడ్డి, కొలామ్, థోటి, చెంచు తెగలకు అందించగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని గిరిజన తెగలకు విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నది. దేశవ్యాప్తంగా గిరిపోషణ్ కార్యక్రమాన్ని చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ కావటం విశేషం.
అంతేకాకుండా, హైదరాబాద్లో ఆదివాసీ, బంజారాభవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. గోండు పోరాటయోధుడు రాంజీగోండు పేరు మీద రూ.15 కోట్లతో స్మారక మ్యూజియాన్ని కూడా నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.