హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. అయినా, మద్యం తాగుడులో మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్! పాలు తాగడం ఆరోగ్యానికి హితం. ముఖ్యంగా పిల్లలకు చక్కని పోషక పానీయం. కానీ, పాలు, పాల ఉత్పత్తుల వినియోగంలో రాష్ట్రం బాగా వెనుకబడింది. పాల సగటు వినియోగం తెలంగాణలో ఏడాదికి 54 లీటర్లు. కానీ, ఇందులోనుంచి ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలను మినహాస్తే.. పేద, నిరుపేదల వాటా 1.7 లీటర్లకు మించడంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. కానీ, లిక్కర్ లెక్కల్లో కిక్కు లెక్కకు మించింది.
రాష్ట్రంలో ఏడాదికి ఒక్కొక్కరు సగటున 4.44 లీటర్ల లిక్కర్ తాగేస్తున్నారు. ఆల్కహాల్ ఉత్పత్తుల అమ్మకాల్లో తెలంగాణ టాప్-3లో ఉండగా, వినియోగంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆలహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) తెలిపింది. సీఐఏబీసీ నివేదించిన లెక్కలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) వెల్లడించిన గణాంకాలకు దగ్గరగా ఉన్నాయి. రాష్ట్రీయ టాప్ త్రీ ఆదాయ వనరులున్న వ్యాపారంలో మద్యంకు చోటు దక్కగా.. పాడి పరిశ్రమకు ప్రోత్సాహం లేక రోజురోజుకూ కునారిల్లిపోతున్నది. కేసీఆర్ హయాంలో గ్రామీణ సగటు పాల వినియోగం రోజుకు 350 ఎంఎల్గా ఉన్నట్టు తేలింది.
దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఆల్కహాల్ ఉత్పత్తుల విక్రయాలు, మద్యం బ్రాండ్ల వినియోగం మీద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆలహాలిక్ బేవరేజ్ కంపెనీస్ సర్వే నిర్వహించింది. ఇటీవలే గణాంకాలు వెల్లడించింది. దేశంలో ఉత్పత్తి అవుతున్న మద్యంతోపాటు దిగుమతి చేసుకుంటున్న విదేశీ మద్యంలో 58% లిక్కర్ దక్షిణాది రాష్ర్టాల్లోనే అమ్ముడుపోతున్నట్టు తేలింది. మద్యం అమ్మకాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉన్నది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రెండూ పెద్ద రాష్ర్టాలే కావడం గమనార్హం. తెలంగాణలో ఏడాదికి 3.1 కోట్ల కేసుల మద్యం అమ్ముడుపోతున్నట్టు గణాంకాల్లో తేలింది. వీటిలో విస్కీ, రమ్, వోడా, జిన్, బ్రాందీ తదితర ఆల్కహాలిక్ ఉత్పత్తులు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే బీరును ఇందులో చేర్చలేదు. రాష్ట్రంలో బీరు విక్రయం కూడా 3.5 కోట్ల కేసులకు మించి ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు.
ఇదే ఏడాది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ దేశంలో మద్యం వినియోగం మీద సర్వే చేసి ఫలితాలు వెల్లడించింది. ఎన్ఐపీఎఫ్పీ నివేదిక ప్రకారం తెలంగాణలో ఏడాదికి సగటు తలసరి ఆలహాల్ వినియోగం 4.44 లీటర్లుగా నమోదైంది. మద్యం కోసం ప్రజలు ఖర్చు చేస్తున్న సొమ్ములో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఒకొకరు ఏడాదికి సగటున రూ.11,351 విలువైన మద్యం తాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రూ.6,399గా మాత్రమే నమోదైంది. మద్యం విక్రయాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా రూ.36,000 కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరుతున్నదని అంచనా. మద్యం ఎక్కువగా వినియోగిస్తున్న జాబితాలో తెలంగాణ తర్వాత కర్ణాటక (4.25 లీటర్లు), తమిళనాడు (3.38 లీటర్లు) ఉండగా, ఆంధ్రప్రదేశ్ (2.71 లీటర్లు), కేరళ (2.53 లీటర్లు) తర్వా త స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే మద్యం వినియోగం ఎకువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
ప్రతి మనిషి రోజుకూ 280 మిల్లీలీటర్ల పాలు వినియోగించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంస్థ సిఫారసు చేసింది. కానీ, తాజా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదక ప్రకారం.. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 190 ఎంఎల్, గ్రామాల్లో 164 ఎంఎల్ మాత్రమే వినియోగిస్తున్నారు. మొత్తం సగటులో ఒక్కొక్కరు ఏడాదికి 54 లీటర్లు వినియోగిస్తున్నారు. ఇందులో 70% వినియోగం ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాల్లోనే ఉన్నదని నివేదిక పేర్కొన్నది. కేసీఆర్ హయాంలో గ్రామీణ వ్యవస్థలు పునర్జీవం పోసుకొని పాడి పరిశ్రమ పెరిగినట్టు వ్యవసాయ శాఖ రికార్డులు చెప్తున్నాయి. నాడు ప్రతి వ్యక్తి రోజుకూ సగటున 350 ఎంఎల్ పాలు వినియోగించినట్టు పాడి పరిశ్రమల శాఖ నివేదికలు చెప్తున్నాయి.
ప్రస్తుతం ప్రతి 20 మందిలో ఒకరు అసలు పాలు వినియోగించడం లేదని తేలింది. ముప్పావు వంతు మంది కనీసం వారానికి ఒకసారి పాలు, పాల ఉత్పత్తులు వినియోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. ఒక వ్యక్తి సగటున ప్రతినెలా పాలు, పాల ఉత్పత్తులపై సుమారు రూ.425 ఖర్చు చేస్తున్నారు. ఇది గ్రామాల్లో రూ.350 మాత్రమే ఉన్నట్టు తేలింది. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి ఒక్కొక్కరు సగటున రూ.4,200 మాత్రమే పాలకు ఖర్చు చేస్తున్నారు. అత్యంత పేదవర్గాల్లో పురుషుల్లో వారానికోసారి సగం మందికిపైగా, మహిళల్లో మూడోవంతు కంటే తకువ మంది పాలు తాగుతున్నారు. దేశంలో సుమారు 48.8% మంది మాత్రమే రోజుకు ఒకసారి పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల చిన్నారులకు పాలు తకువగా అందుతున్నాయి.
