WEF | హైదరాబాద్, జనవరి 17 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పులతో రానున్న 25 ఏండ్లలో భారీ అనర్థాలు జరిగే ప్రమాదమున్నదని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) హెచ్చరించింది. భూతాపంతో ఉష్ణోగ్రతలు 2.5 నుంచి 2.9 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర పెరిగితే వరదలు, కరువులు, వేడి గాలులు, ఉష్ణమండల తుపానులు, కార్చిచ్చులు సంభవించవచ్చని, సముద్ర మట్టాలు పెరుగొచ్చని అంచనా వేసింది.
దీంతో 2050నాటికి 1.45 కోట్ల మంది మృత్యువాత పడొచ్చని, 12.5 ట్రిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్క వరదల కారణంగానే 85 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని, కరువులతో మరో 32 లక్షల మంది విగతజీవులుగా మారుతారని తెలిపింది. వేడి గాలుల కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు 2050నాటికి 7.1 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లవచ్చని డబ్ల్యూఈఎఫ్ అంచనా వేసింది.