హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ)/ రవీంద్రభారతి: దివ్యాంగులు తలెత్తు కొని బతికేలా రూ.3,016 పింఛన్ ఇస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల సంక్షేమ దినం సందర్భంగా శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మొదట వికలాంగులు అనే పదాన్ని తొలగించి, దానిస్థానంలో దివ్యాంగులు అనే పదం చేర్చినట్లు తెలిపారు. రాష్ట ప్రభుత్వం వారిని కంటికి రెప్పలాగా చూసుకుంటుందని చెప్పారు. దివ్యాంగుల బాధ్యత, సంక్షేమం, అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రూ.500 పింఛన్ నుంచి రూ.3,016కు పెంచామని గుర్తుచేశారు. రాష్ట్రంలో 5లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. అందుకోసం ఏటా 18 వందల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. దివ్యాంగులను ఇతరులు పెండ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ప్రోత్సాహకం ఇస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగాలలో 2 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలలో రిజర్వేషన్లను 3 నుంచి 5 శాతం పెంచినట్టు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో 5 శాతం కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. రూ.21 కోట్లతో 14 వేల మందికి ఉపకరణాలు ఇస్తున్నామని చెప్పారు. దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన దివ్యాంగులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. మంత్రులు దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిల్తోపాటు ఇతర పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, స్పెషల్ సెక్రటరీ దివ్య దేవరాజ్, డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.