హైదరాబాద్, జూలై 8 (నమస్తేతెలంగాణ): ‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలనాదక్షతతోనే మరోసారి రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ప్రపంచబ్యాంకు తెలంగాణను ఎగువ మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థగా గుర్తించడమే ఇందుకు నిదర్శనం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4.19 లక్షల తలసరి ఆదాయంతో తెలంగాణ వరల్డ్ బ్యాంక్ ఎగువ మధ్య ఆదాయ క్యాటగిరీలో చేరిందని వెల్లడించారు. ఈ మైలురాయిని అధిగమించిన 5 భారతీయ రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలువడం గర్వకారణమని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో దశాబ్దకాంలో తెలంగాణ సాధించిన అసాధారణ ఆర్థిక పరివర్తన వల్లనే ఈ విశేష విజయం దక్కిందని పేర్కొన్నారు. పారిశ్రామికంగా, ఆర్థికంగా సుదీర్ఘకాలం అనుకూలతలు ఉన్న ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా, దార్శనిక నాయకత్వం, సాహసోపేతమైన సంస్కరణలు, వినూత్న పాలనతోనే ఈ విజయం దక్కిందని పేర్కొన్నారు.
వినూత్న పథకాలతో ఆర్థిక పురోభివృద్ధి
పారిశ్రామిక అనుమతుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన కేసీఆర్ అపూర్వమైన పెట్టుబడులను ఆకర్షించారని కేటీఆర్ తెలిపారు. టీఎస్-ఐపా స్, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, రైతుబంధు, మిషన్ భగీరథ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలు.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, వెరసి తెలంగాణ సమ్మిళితవృద్ధి, మెరుగైన ఉపాధికి బలమైన పునాదులు వేశాయని వివరించారు. యథాతథస్థితిని సవాల్ చేసేందుకు ఒక సంస్కర్త, అద్భుతమైన ఫలితాలు అందించేందుకు ఒక కార్యదక్షుడు, ఒక రాష్ట్ర తలరాతను మార్చివేసేందుకు ఒక నిజమైన మార్గదర్శి అవసరమని, ఈ లక్షణాలే కేసీఆర్ పదేండ్ల పాలనను నిర్వచిస్తాయని కొనియాడారు. రేవంత్ సర్కార్ రెండున్నరేండ్ల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు తెలంగాణను దివాలా రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దని సూచించారు.