Annaram Barrage | కాళేశ్వరం, జూన్ 3: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో గ్రౌటింగ్ పనులు వరద కారణంగా ఆగిపోయాయి. ఈ పనులను వేసవిలోనే చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోలేదు. తీరా వర్షాకాలం ముందు పనులు మొదలు పెట్టడంతో వరద కారణంగా పనులు నిలిచిపోయాయి. విలువైన సమయాన్ని వృథా చేసి వర్షాకాలంలో పనులకు శ్రీకారం చుట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్నారం బరాజ్‌లో డౌన్ స్ట్రీమ్‌లో 38వ పిల్లర్ గేట్ వద్ద జరుగుతున్న పనులు వర్షం కారణంగా ఆగిపోయాయి. మళ్లీ ఒకటి రెండు రోజుల్లో పనులు ప్రారంభించనున్నట్టు ఇంజినీర్లు తెలిపారు. అలాగే బరాజ్‌లో సీసీ బ్లాక్ పనులు కొనసాగుతున్నాయి. సీసీ బ్లాక్‌లు ఒకదాని పక్కన ఒకటి అమర్చి ఆ మధ్యలో లారీల ద్వారా ఇసుక తీసుకొచ్చి నింపుతున్నారు. బరాజ్ ముందు భాగంలో ఇప్పటికే 2 లక్షల టన్నుల ఇసుక తీశారు. మరో 7 లక్షల టన్నుల ఇసుక తీయాల్సి ఉన్నది. వర్షాలు భారీగా పడితే ఇసుక తీయడం ఆపేస్తారు.
మేడిగడ్డలో కొనసాగుతున్న మరమ్మతులు
మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు వర్షాకాలంలో దెబ్బతిన్న పిల్లర్ల వద్ద అప్, డౌన్ స్టీమ్ ఏడు, ఎనిమిదో బ్లాక్‌లలో పనులు చేస్తున్నారు. బరాజ్ వద్ద జరుగుతున్న పనులను సోమవారం భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు పరిశీలించారు. బరాజ్‌లోని ఏడో బ్లాక్ వద్ద ఏర్పడ్డ ఖాళీ ప్రదేశాలను సిమెంట్, ఇసుకతో పూడ్చి వేసేందుకు గ్రౌటింగ్ పనులు జరుగుతున్నాయి.
బరాజ్ దిగువన కుంగిన పియర్ల ప్రాంతంలో కాపర్ షీట్ ఫైల్స్‌ను అమర్చుతున్నారు. 20, 21 గేట్ల కట్టింగ్, డౌన్ స్ట్రీమ్‌లో క్రేన్ల సాయంతో సీసీ బ్లాక్ అమరిక పనులు చేపడుతున్నారు. ఆదివారం కురిసిన భారీ వర్షం నేపథ్యంలో సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రిసెర్చ్ స్టేషన్), సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందాల సోమవారం నాటి పర్యటన వాయిదాపడినట్టు నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. నిపుణుల పర్యటన త్వరలో నిర్ణయించనున్నట్టు తెలిసింది.