జయశంకర్ భూపాలపల్లి, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టును ఈ ఏడాది సైతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పక్కనపెట్టే కుట్ర కొనసాగిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 30 నెలలుగా కాలయాపన చేసిన కాంగ్రెస్ సర్కార్ రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో టెస్టింగ్ పనులను ప్రారంభించింది. ఇవి పూర్తికాగానే మరమ్మతు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంకా అదే నిర్లక్ష్యపు వైఖరిని అవలంబిస్తున్నది. వానకాలం సమీపిస్తున్న సమయంలో కావాలనే టెస్టింగ్ పనులు ప్రారంభించి వరదల సాకుతో మళ్లీ మరో ఏడాది వాయిదా వేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, మేడిగడ్డ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న అధికారులందరినీ ప్రభుత్వం హఠాత్తుగా బదిలీ చేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
‘ముఖ్య’నేత అనుచరుడికి పనులు
ప్రభుత్వం అన్నారం, సుందిళ్ల బరాజ్ టెస్టింగ్ పనులకు సంబంధించి అధికారికంగా ఏ ఒక్క ఏజెన్సీతోనూ అగ్రిమెంట్ చేసుకోకుండానే టెస్టింగ్ పనులు కొనసాగిస్తున్నదని, రాష్ట్ర ముఖ్యనేత అనుచరుడికి అనధికారికంగా బరాజ్‌ల పరీక్షలు చేయించే బాధ్యత అప్పగించారనే ఆరోపణలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది వారాల ముందు 2023 అక్టోబర్ 23న మేడిగడ్డ బరాజ్‌లో భారీ శబ్దంతో ఏడవ బ్లాకులోని 20వ పిల్లర్ కుంగింది. 2022లో 29 లక్షల క్యూసెక్కులు, 2023లో 15 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని నిలిచిన మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్ కుంగడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అప్పటినుంచి నీటిని మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు పంపిస్తున్నారు. గత 30 నెలలుగా బరాజ్‌ను పక్కనపెట్టిన రేవంత్ సర్కార్ ఇటీవల మరమ్మతు చేయిస్తామని ప్రకటించినప్పటికీ, పరీక్షల పేరుతో మళ్లీ కాలయాపన చేస్తున్నది. మూడు బరాజ్‌ల్లో పరీక్షల పేరుతో జాప్యం చేస్తూ వస్తున్నది. ఈ వానకాలం సైతం గోదావరి జలాలు మళ్లీ సముద్రం పాలు చేసే కుట్ర చేస్తున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో అవసరమైన పరీక్షల కోసం నిధులు విడుదల చేశామని, ఏజెన్సీలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఏజెన్సీలతో అగ్రిమెంట్ కుదుర్చుకోలేదని, ముఖ్యనేత అనుచరుడికి అనధికారికంగా అప్పగించారని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో మేడిగడ్డ ఏజెన్సీ పనులను ఎట్టకేలకు ఇటీవల ఎల్అండ్టీకి అప్పగిస్తూ అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలుస్తున్నది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ఏజెన్సీ పనులను ముఖ్యనేత అనుచరుడు చూసుకుంటున్నట్టు సమాచారం.
అరకొరగానే టెస్టులు
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులను ఎన్డీఎస్ఏ నివేదిక సూచనల మేరకు చేపట్టాల్సి ఉన్నది. అందులో భాగంగా బరాజ్‌లకు సంబంధించి జియోఫిజికల్, జియో టెక్నికల్, జియో పెనెట్రేటింగ్ రాడర్ టెస్ట్‌లను పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉన్నది. ఆ టెస్టుల నివేదికలను సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏకు పంపి, డిజైన్లను కూడా రూపొందించి వాటికీ ఆమోదం పొందిన తరువాత పనులను చేపట్టాల్సి ఉంటుంది. టెస్టులను మే 28వ తేదీలోగా పూర్తి చేస్తామని సర్కార్ చెప్తూ వచ్చింది. సమీక్షల మీద సమీక్షలు పెట్టి హంగామా చేసింది. అయితే క్షేత్రస్థాయిలో సాంకేతిక పరీక్షల పనులు ఎక్కడివక్కడే మిగిలిపోయాయి. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు చేయాల్సిన టెస్టుల కోసం బోర్‌హోల్స్ వేయాల్సి ఉంటుంది. బరాజ్ పొడవునా, ప్రతి బ్లాక్‌లో పదుల సంఖ్యలో బోర్లు వేయాల్సి ఉన్నది. మొత్తంగా బరాజ్‌ల్లో సాంకేతిక పరీక్షల కోసం దాదాపు 520 బోర్లు వేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటివరకు మేడిగడ్డలో 11 బోర్‌హోల్స్, అన్నారంలో 10, సుందిళ్లలో 9 మాత్రమే పూర్తి చేశారు. ఇతర టెస్టులు సైతం కనీసం 25% కూడా పూర్తికానీ దుస్థితి నెలకొన్నది.
నేడు కల్నల్ రాక
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను పరిశీలించేందుకు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ గురువారం వస్తారని తెలిసింది. ఈ మేరకు ఈఈలు, డీఈలు, ఏఈలు బరాజ్‌ల వద్దకు చేరుకున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాద మృతులను వెలికితీసే కార్యక్రమంలో కల్నల్ ప్రధాన పాత్ర పోషించారని, ఆయనను కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పంపిస్తున్నారని అధికారుల ద్వారా తెలిసింది. ఐఐటీలో పీహెచ్డీ చేసిన కల్నల్ మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో పనిచేస్తున్నారని చెప్తున్నారు. కాగా, ఆయన మొదట మేడిగడ్డ, అనంతరం అన్నారం బరాజ్‌లను పరిశీలించి వీలునుబట్టి సుందిళ్లకు వెళ్తారని, అధికారులతో అన్నారంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని సమాచారం. ఇదిలా ఉండగా ఒకవైపు బరాజ్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా, మేడిగడ్డ ఈఈ తిరుపతిరావుతోపాటు డీఈ, ఏఈలను ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అన్నారం ఈఈ యాదగిరి గతంలోనే ఉద్యోగ విరమణ పొందగా, ఆయన స్థానంలో ఈఈగా రమేశ్‌బాబు విధులు నిర్వర్తిస్తున్నారు. రమేశ్‌బాబు ఈ ప్రాంతానికి కొత్త కావడం, మేడిగడ్డ ఈఈ తిరుపతిరావు సహా అధికారులంతా బదిలీ కావడం, సుందిళ్ల ఈఈ మరో నెలలో ఉద్యోగ విరమణ పొందనుండటంతో ప్రాజెక్టుపై అవగాహన ఉన్న అధికారులు లేని పరిస్థితి నెలకొన్నది.