Singareni | పెద్దపల్లి, మే 28 (నమస్తే తెలంగాణ): సింగరేణి గనుల్లో నిత్యం చెమటోడ్చి నల్లబంగారాన్ని వెలికి తీస్తున్న కార్మికులు సంస్థ లాభాల్లో వాటా కోసం ఎదురుచూస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసి 2 నెలలు గడిచినా ఇప్పటివరకు యాజమాన్యం తమ లాభాల వివరాల ను, శ్రామికుల వాటాను ప్రకటించకపోవడంతో బొగ్గుగని కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోల్ ఇండియా పరిధిలోని సంస్థలన్నీ తమ కార్మికులకు సకాలంలో లాభాల వాటా పంచుతుంటే.. సింగరేణిలో మాత్రం ఏటా ఆలస్యమవుతున్నదని మండిపడుతున్నారు.
రాష్ట్రంలో సింగరేణి విస్తరించి ఉన్న 6 జిల్లాల్లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 72 వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగడంతో సంస్థకు రూ.2,412 కోట్ల లాభా లు వచ్చాయి. అందులో కార్మికులకు 33% వాటా ప్రకటించి, వారి ఖాతాల్లో రూ.795 కోట్లు జమ చేసింది. కానీ, 2024-25 సింగరేణి 69.01 వేల మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. ఇది క్రితం ఏడాది కంటే 3 వేల టన్నులు తక్కువ.
అయినప్పటికీ దేశీయ మారెట్లో బొగ్గుకు డిమాం డ్ భారీగా ఉండటంతో లాభాలు అత్యధికంగానే వచ్చి ఉంటాయని కార్మికులు భావిస్తున్నారు. 2019-20లో 993 కోట్ల లాభంలో కార్మికులకు 28% వాటా ఇచ్చింది. 2020-21లో 29 శాతానికి, 2021-22లో 30 శా తానికి, 2022-23లో 32 శాతానికి, 20 23-24లో 33 శాతానికి వాటా పెంచింది. ఈసారి సింగరేణికి భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉండటంతో తమ వాటా శాతాన్ని పెంచాలని కార్మికులు కోరుతున్నారు.