మామిళ్లగూడెం, జూన్ 4: ‘వేతనాలు చెల్లించండి మహాప్రభో’ అంటూ మిషన్ భగీరథ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐఎన్టీయూసీ అనుబంధ మిషన్ భగీరథ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం లోని మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తలారి రాములు మాట్లాడుతూ.. నాలుగునెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగ భద్రత కల్పించి, పెండింగ్లోని జీతాలు మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.