Singareni | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రేయింబవళ్లు శ్రమించి నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికుల్లో ఈ ఏడాది దసరా ఉత్సాహం కనిపించడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదున్నర నెలలు గడుస్తున్నా ఇంకా టర్నోవర్‌ను ప్రకటించని యాజమాన్యం.. దసరా సమీపిస్తున్నా లాభాల్లో కార్మికుల వాటాను తేల్చడం లేదు. దీంతో పండుగనాటికి లాభాల్లో వాటా వస్తుందో రాదోనని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసిన రెండుమూడు నెలల్లో యాజమాన్యం టర్నోవర్‌ను ప్రకటిస్తుంది. దసరాకు రెండు, మూడు వారాల ముందు లాభాల్లో కార్మికుల వాటాను ప్రకటించి, పండుగనాటికి వారి ఖాతాల్లో జమ చేస్తుంది. కానీ, ఈసారి పండుగకు ఇంకో 3 వారాలే ఉన్నా టర్నోవర్గానీ, లాభాల్లో వాటాగానీ తేల్చలేదు. దీంతో యాజమాన్యం, ప్రభుత్వ వైఖరిపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నిరుడు జూలైలోనే టర్నోవర్ ప్రకటన
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి యాజమాన్యం గత పదేండ్లలో క్రమం తప్పకుండా టర్నోవర్‌ను ప్రకటించి, లాభాల్లో కార్మికులకు వాటా పంచింది. నిరుడు జూలై 6న యాజమాన్యం టర్నోవర్‌ను ప్రకటించింది. రూ.33 వేల కోట్లకుపైగా టర్నోవర్ సాధించామని, రూ.2,222 కోట్ల లాభాన్ని ఆర్జించామని తెలిపింది. ఈ లాభాల్లో 32% వాటాను కార్మికులకు అందజేస్తున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం దసరాకు దాదాపు 3 వారాల ముందుగానే అక్టోబర్ 7న ప్రకటించింది. పండుగకు 3 రోజుల ముందు రూ.711 కోట్లను కార్మికుల ఖాతాల్లో జమ చేసింది. సగటున ఒక్కొక్కరి ఖాతాలో రూ.1.70 లక్షలు జమ అయినట్టు కార్మికులు చెప్తున్నారు. కానీ, ఈ ఏడాది సింగరేణి పద్దుల లెక్కతేల్చడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీంతో పండుగకు ఖాతాల్లో డబ్బులు పడతాయో లేదోనని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం సింగరేణిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగినట్టు కార్మిక సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. రూ.37 వేల కోట్ల వ్యాపారం జరిగిందని, దాదాపు రూ.3 వేల కోట్ల లాభాలు వచ్చాయని చెప్తున్నారు. లక్ష్యానికి మించి ఉత్పత్తి జరిగినందున ఈ ఏడాది లాభాల్లో కార్మికులకు కనీసం 35% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పోరుబాటలో టీబీజీకేఎస్
ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి, ఆదాయ వివరాలను ప్రకటించకపోవడంపై టీబీజీకేఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఆ వివరాలను ప్రకటించాలని ఇప్పటికే అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోకపోవడంతో పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నది. ఈ నెల 19న సింగరేణిలోని అన్ని జీఎంల కార్యాలాయల ఎదుట ధర్నాలకు దిగుతామని టీబీజీకేస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రకటించారు. ఇది ఆరంభమేనని, ప్రభుత్వం, యాజమాన్యం దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికులను కంటికి రెప్పలా చూసుకున్నారని, దీనికి భిన్నంగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు గని కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని మండిపడ్డారు. పండుగకు రెండుమూడు రోజుల ముందే కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమచేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ముందే ప్రకటించిన కోల్ ఇండియా
దేశంలో 85% బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కోల్ ఇండియా సంస్థ.. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల రోజుల్లోనే తమ పద్దుల లెక్కలు తేల్చింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,42,324 కోట్ల వ్యాపారం చేశామని, రూ.37,369 కోట్ల లాభాలు వచ్చాయని మే 2వ తేదీనే వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోని తొలి త్రెమాసికంలో సాధించిన ఉత్పత్తి, ఆదాయం వివరాలను సైతం జూలై 31నే ప్రకటించింది. మరో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ సైతం రూ.1,78,501 కోట్ల వ్యాపారంతో రూ.5,506 కోట్ల లాభాలు ఆర్జించినట్టు జూలై 27నే ప్రకటించింది. కానీ, సింగరేణి యాజమాన్యం మాత్రం 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదున్నర నెలలు గడిచినా ఇప్పటికీ ప్రకటించలేదు.