Singareni | కాసిపేట, సెప్టెంబర్ 21: సింగరేణి సంస్థకు వచ్చిన లాభం రూ.4,701 కోట్లు. దానిలో రూ.2,283 కోట్లను మినహాయించి, రూ.2,412 కోట్లలో నుంచే 33 శాతం వాటా ప్రకటించారు. మునుపెన్నడూ లాభంలో సగం పక్కన పెట్టి మిగతా సగంలో వాటా ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో చేయని ఆ పని ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అని మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట-2 ఇైంక్లెన్ గనిలో కార్మికులు ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గేట్ మీటింగ్‌లో గనిపైకి వెళ్లి ఐఎన్టీయూసీ నాయకుడు పుల్లూరి లక్ష్మణ్ సహా పలువురిని నిలదీశారు. ‘సింగరేణికి రూ.4,701 కోట్ల లాభాల్లో 33 శాతం అంటే రూ.1,550 కోట్లు రావాలి.
కానీ ప్రకటించింది రూ.796 కోట్లేనని చెప్పారు. లాభాల్లో రూ.2,283 కోట్లను పక్కన పెట్టి మిగిలిన దాంట్లో వాటా ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఎంత లెక్కలు చేసినా ప్రభుత్వం ఇచ్చేది 17 శాతానికి లోపేనని తేల్చిచెప్పారు. నికర లాభంలో 33 శాతం ఇవ్వాలని, లేకపోతే 33 శాతం ఇస్తున్నట్టు చేసిన ప్రకటనను వెనక్కి తీసుకొని, ఎంత ఇస్తున్నారో బయటికి చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికులు లెక్కలేసి మరీ చెప్పడంతో ఐఎన్టీయూసీ నాయకులు సమాధానం చెప్పలేక పోయారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని వచ్చాయి? ఇప్పుడు ఎంత వచ్చాయని ప్రశ్నించారు. లాభాల వాటా, బోనస్‌పై కార్మికులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కార్మిక సంఘం నాయకులు సమాధానాలు చెప్పలేకపోయారు. కేసీఆర్ ఉన్నప్పుడు లాభాల్లో వాటా ఎక్కువ వచ్చిందని, ఇప్పుడు లాభాలు ఎక్కువ శాతం, ఇచ్చేది తక్కువ శాతం ఉన్నదని, ఆ డబ్బు ఎటు వెళ్తున్నదో చెప్పాలంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.