పాలకవీడు, సెప్టెంబర్ 22: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానిపురంలోని డెక్కన్ సిమెంట్ పరిశ్రమ వద్ద సోమవారం కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై కార్మికులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు కాగా, పోలీస్ వాహనం, సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎస్సై కోటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లా కాకర్ఘాట్కు చెందిన వినోద్ (45) అవాక్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వచ్చి డెక్కన్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 5గంటల సమయంలో బట్టలు ఉతుకుతుండగా గుండెపోటుతో మరణించాడు.
వినోద్ మృతికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయంపరిశ్రమ వద్ద తోటి కార్మికులు ధర్నా నిర్వహించారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు నలుగురు కార్మికులు వస్తే పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడి పరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కార్మికులు వినకుండా మూకుమ్మడిగా రాళ్లతో పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. సెక్యూరిటీ గది, పోలీస్ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం పరిశ్రమ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఘటనా స్ధలాన్ని ఎస్పీ నరసింహ పరిశీలించారు. దాడి చేసిన వారిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్టు ఎస్పై తెలిపారు.