హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో చూపు మందగిస్తున్నది. ఈ సమస్య రోజురోజుకూ పెరిగిపోవడం తో వస్త్ర ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ తాజాగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. ‘హైదరాబాద్లోని వస్త్ర పరిశ్రమ కార్మికుల్లో దూర, సమీ ప దృష్టి లోపాలు, పని ఉత్పాదకతపై దాని ప్రభావం’ పేరిట నిర్వహించిన ఈ సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నగరంలోని ఐదు వస్త్ర పరిశ్రమల్లో 1,361 మందిపై సర్వే నిర్వహించారు. ఉద్యోగుల్లో దగ్గరి చూపు సమస్యలు, దూరపు చూపు సమస్యలు కనిపించినట్టు రిపోర్టు స్పష్టంచేసింది. 40 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కార్మికు ల్లో 52.4% మంది దగ్గరి దృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. 6.9% మంది దూరపు దృష్టి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
లోపాలు ఉన్న కార్మికులు తక్కువ పని సామర్థ్యం కలిగి ఉన్నారని రిపోర్టు తెలిపింది. దీంతో ఈ పరిణామం ఉత్పాదకతపై తీవ్ర ప్ర భావం చూపుతున్నది. వక్రీభవన లోపాలను పట్టించుకోకపోవడంతో దూరపు చూపు సమ స్య పెరుగుతున్నది. మొత్తం కేసుల్లో ఇవి 90.4శాతంగా ఉన్నట్టు సర్వే తెలిపింది. వయసురీత్యా వచ్చే లోపాలను నిర్లక్ష్యం చేయడం దగ్గరి చూపు లోపాలకు ప్రధాన కారణంగా తే లింది. అధ్యయనంలో పాల్గొన్నవారిలో 87 మంది మహిళలు ఉన్నారు. దుస్తులు కుట్ట డం, కత్తిరించడం వంటి పనులపై దృష్టి లోపం తీవ్ర ప్రభావం చూపుతున్నది.
దృష్టి లోపాల కారణంగా ఉత్పాదకత 40 శాతానికి పైగా తగ్గుతున్నట్టు అధ్యయనం వెల్లడించింది. సమస్యను అధిగమించేందుకు వస్త్ర పరిశ్రమ ల్లో క్రమం తప్పకుండా కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. దృష్టి సమస్యలు తగ్గించేందుకు కంటి అద్దాలు అందించాలని పేర్కొన్నది. పరిశ్రమల్లోనే నేరుగా కంటి సంరక్షణ సేవలు అందించాలని కోరింది. కార్మికుల దృష్టి లోపాలను సరిచేయడం ద్వారా పరిశ్రమల యాజమాన్యాలు ఉత్పాదకతను పెంచడంతో పాటు వారిపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చని అధ్యయనం సూచించింది.