కరీంనగర్ విద్యానగర్, జూన్ 25 : ప్రభుత్వ దవాఖానాల్లో(Government hospital )పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు( pending wages) వెంటనే చెల్లించాలని మంగళవారం కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన ఎదుట కార్మికులు ధర్నా(Workers dharna) చేశారు. వరర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్ మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేస్తున్న సానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు కార్మికులు రెండు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకో వారం గడిస్తే వేతనాలు రాక మూడు నెలలు అవుతుందని తెలిపారు. పిల్లలకు స్కూల్ ఫీజులు, బుక్స్, యూనిఫామ్‌ల కోసం ఇబ్బందులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేకపోతే యజమానులు ఖాళీ చేయాలని అంటున్నారని వాపోయారు. ఇతర కిరాణ సరకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నట్లు చెప్పారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్మికుల వేతనాలకు సంబంధించిన బడ్జెట్ 542 పడకలకు ఉంటే 332 పడకలకు మాత్రమే బిల్లు రావడం ఏంటో అర్థం కావడం లేదని, దీనికి కారకులపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే కార్మికుల వేతనాల బడ్జెట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో కలెక్టరెట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ప్రభుత్వ దవాఖాన వరర్స్, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పీ అరుణ్, ఉపాధ్యక్షులు కళావతి, యూత్ లీగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రినేత, శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్, 100 మంది కార్మికులు పాల్గొన్నారు.