రాజన్న సిరిసిల్ల, మే 29 (నమస్తే తెలంగాణ) : నేత కార్మికులను యజమానులుగా మార్చే వర్కర్ టు ఓనర్ స్కీమ్‌కు కాంగ్రెస్ తూట్లు పొడుస్తున్నది. షెడ్లను నేత కార్మికులకు అందించకుండా 30 నెలలుగా చోద్యం చూస్తూ తాజాగా ధాన్యం బస్తాలను నిల్వ చేస్తున్నది. కేసీఆర్ సర్కార్ హయాంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల నేత కార్మికులకు శాశ్వత ఉపాధితోపాటు కార్మికులను యజమానులుగా చేయడానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ శివారులో 88 ఎకరాల్లో అపెరల్ పార్కు ఏర్పాటు చేసి రూ.388 కోట్లతో వర్క్షెడ్లను నిర్మించి మౌలిక వసతులు కల్పించారు.
ఈ బృహత్తరమైన పథకాన్ని 2017 అక్టోబరు 11న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కాగా నేత కార్మికుల కోసం నిర్మించిన వర్క్షెడ్లలో యాసంగి ధాన్యం నిల్వ చేస్తున్నారు. అవసరానికి వినియోగిస్తున్నప్పటికీ నేత కార్మికులను యజమానులుగా మార్చే లక్ష్యంగా మాత్రం నెరవేరడం లేదు. నేత కార్మికులపై ప్రభుత్వం కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ స్పందించి నేతన్నలను యజమానులుగా వర్క్షెడ్లను వినియోగంలోకి తేవాలని నేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.