వైరాటౌన్, జూన్ 27 : అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు. ఆధార్ కార్డులు చూపుతూ ఇండ్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు, సుంకర సుధాకర్ మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ పరిధిలో చాలా మంది నిరుపేదలు ఇండ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, అర్హతలనుబట్టి ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.
ఇంకా చదవల్సిన వార్తలు
ఇందిరమ్మ ఇల్లు రాదని ఆత్మహత్యాయత్నం ; వైరా మాజీ కౌన్సిలర్ భర్త దూషించారని మహిళ ఆరోపణ
వైరాటౌన్, జూన్ 27 : తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఓ మహిళ మాజీ కౌన్సిలర్ భర్తను కోరగా .. ఇల్లు రాదని చెప్పడంతోపాటు అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో మనస్తాపం చెందిన మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా రిధి గండగలపాడులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గండగలపాడుకు చెందిన కొనకళ్ల ఉష అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నది. ఇందిరమ్మ ఇండ్ల మొదటి జాబితాలో ఆమె పేరు ఉండగా జాబితా నుంచి తొలగించారు. ఈ విషయమై ఉష మాజీ కౌన్సిలర్ భర్త, కాంగ్రెస్ నాయకుడు కర్నాటి హన్మంతరావు వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించగా.. అతడు అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో మనస్తాపం చెందిన ఉష నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు వైరా ప్రభుత్వ దవాఖానకు తరలించి.. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం దవాఖానకు తీసుకెళ్లారు.