Sangareddy | అందోల్, ఏప్రిల్ 3: సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్లో గురువారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహకు నిరసనసెగ తగిలింది. పేదలందరికీ సన్నబియ్యం అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ అనగా, ప్రభుత్వ పథకాలు అందజేయకుండా మాటలు చెప్తున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త రేషన్కార్డులే రాలేదు…బియ్యం ఎలా ఇస్తారంటూ కొందరు మహిళలు మంత్రిని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు ఒక్కటైనా సక్రమంగా అమలుచేస్తున్నారా..? అంటూ గట్టిగా అరిచారు. దీంతో పోలీసులు వారి వద్దకు వెళ్లి గొడవ పెద్దదికాకుండా చూశారు. మంత్రి సభలో మాట్లాడిన తర్వాత లబ్ధ్దిదారులను ఒక్కొక్కరిగా పిలువాలని అధికారులను పురమాయించారు. దీంతో పలువురు ఒక్కసారిగా రావడంతో.. పది మందే అయితే ఇంతమంది ఎందుకు వచ్చారని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో లబ్ధిదారులు వద్దంటే చెప్పండి వెళ్లిపోతామని అనడంతో.. మంత్రి వారికి సర్దిచెప్పి బియ్యం పంపిణీ పూర్తిచేశారు.
రైతులకు రుణమాఫీ చేయడానికే ఖజానాలో పైసలు లేవని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అన్నారు. గురువారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్లలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ కాంగ్రెస్ కార్యకర్త తనకు రుణమాఫీ కాలేదని చెప్పడంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని, ప్రభుత్వ ఖజానాకు పైసలు వచ్చినప్పుడు మాత్రమే రుణమాఫీ చేస్తుందనడంతో రైతులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ‘నాకూ అప్పు ఉన్నది.. 20 ఎకరాల భూమి ఉంది.. ఇంత వరకు రైతు భరోసా పడలేదు’ అని ఎమ్మెల్యే తెలిపారు. నేను మీకు అందుబాటులో లేకున్నా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనడంతో ప్రజలు విస్తుపోయారు. – మరిపెడ