కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన దార్ల రేణుశ్రీ ది ఆత్మహత్య కాదని హత్య చేసి నేటి సంపులో వేశారని మహిళా సంఘాల నాయకులు ఆరోపించారు. ఆదివారం రేణు శ్రీ స్వగ్రామం గూడూరులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ రేణు శ్రీకి పిల్లలు పుట్టడం లేదని వేధింపులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. భర్త ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి పిల్లలు పుట్టడం లేదని అనడం సిగ్గుచేటు అన్నారు.
పిల్లలు పుట్టకపోవడం భార్య లోపం మాత్రమే కాదని భర్త లోపం ఉంటుందన్నారు. పిల్లల కోసం డాక్టర్ను సంప్రదించకుండా శారీరకంగా, మానసికంగా రేణుశ్రీని వేధించారన్నారు. భర్త, అత్తమామలే రేణు శ్రీని హత్య చేసి నీటి సంపులో పడేసినట్లు ఆరోపించారు. మృతి చెంది మూడు రోజులైనా భర్త, అత్తమామలను అరెస్టు చేయలేదని విమర్శించారు. పోలీసులు వెంటనే అరెస్టు చేయకపోతే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.