హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు. రుణమాఫీపై గ్రౌండ్ రిపోర్టు కోసం నాగర్‌కర్నూలు జిల్లాలోని సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లికి వెళ్లిన జర్నలిస్టులపై గురువారం కాంగ్రెస్ మూకలు దాడిచేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవా రం జర్నలిస్టు సంఘాలతో కలిసి బాధిత జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి హైదరాబాద్‌లోని మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రిపోర్టింగ్‌కు వెళ్లిన తమపై కొందరు గూండాల్లా వ్యవహరించి దాడిచేశారని, అసభ్యకరంగా ప్రవర్తించారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి దారుణ పరిస్థితిని తాము గతంలో ఎక్కడా చూడలేద ని అన్నారు. స్పందించిన కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చైర్‌పర్సన్‌ను కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఏ రమణకుమార్ ఉన్నారు.