హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ‘స్థలం లీజుకు ఇప్పిస్తాం. పెట్టుబడి కోసం బ్యాంక్ రుణాలు సమకూరుస్తాం. ప్లాంట్ మొత్తం వ్యయంలో 10 శాతం మహిళా సంఘాలు సమకూరిస్తే 90 శాతం బ్యాంకు రుణంగా ఇప్పిస్తాం. ఉత్పత్తి అయిన విద్యుత్తును కిలోవాట్‌కు రూ.3.13 చొప్పన 25 ఏండ్లపాటు ప్రభుత్వరంగ విద్యుత్తు సంస్థలు (డిస్కంలు) కొనుగోలు చేస్తాయి. మేమే టెండర్లు పూర్తిచేస్తాం. ఎంపిక చేసిన సంస్థలే ప్లాంట్లను ఏర్పాటు చేస్తాయి.
మీరు ప్లాంట్‌ను నిర్వహించుకుంటూ రుణాల కిస్తీలు కట్టుకుంటే చాలు, మీకు లాభాలే లాభాలు. మీరు వ్యాపారవేత్తలైపోతారు’ ఇది సోలార్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో మహిళా స్వయంసహాయక సంఘాలకు ప్రభుత్వ వర్గాల ప్రకటన. ఇన్ని ప్రయోజనాలు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించినా మహిళా సంఘాల నుంచి స్పందన కానరావడంలేదు. ప్లాంట్ల ఏర్పాటుకు మహిళామణులు ముందుకు రావడమే లేదు. దీంతో ప్లాంట్ల ఏర్పాటుపై నీలినీడలు కమ్మకున్నాయి.
పీఎం కుసుమ్ స్కీంలో భాగంగా 4,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 1,000 మెగావాట్ల ఉత్పత్తి ప్లాంట్లను మహిళా సంఘాలకు కేటాయించింది. మిగతా 3,000 మెగావాట్ల ప్లాంట్లను రైతులకు అప్పగించింది. టీజీ రెడ్కోను నోడల్ ఏజెన్సీగా నియమించింది. మహిళా శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధిశాఖలకు బాధ్యతలను అప్పగించింది.
ఈ వెయ్యి మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటుచేసే సంస్థలను ఎంపిక చేసేందుకు టీజీ రెడ్కో టెండర్లను కూడా పూర్తిచేసింది. జనవరిలోనే ప్లాంట్ల ఏర్పాటుకు వర్క్ ఆర్డర్లు ఇస్తామని, ప్లాంట్ల ఏర్పాటు ఇట్టే జరిగిపోతుందని అధికారులు ఆశించారు. పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇంధనశాఖ అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం 1,000 మెగావాట్లకు గాను ఇప్పటివరకు 260 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు మాత్రమే మహిళా సంఘాలు దరఖాస్తులు సమర్పించాయి.
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై పలు సందేహాలు, అనుమానాలు పీడిస్తున్నాయి. మొదట రెండుకోట్లకు ఏడేండ్లపాటు 6 శాతం వడ్డీగా వసూలు చేయనుండగా, ఏడేండ్లు దాటిన తర్వాత వడ్డీశాతం పెరగనున్నది. టర్మ్ మొత్తంలో వడ్డీశాతం 9 శాతానికి చేరుతుందన్న ఆందోళన వెంటాడుతున్నది. స్థల సేకరణ సైతం మరో సమస్యగా మారింది. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్లాంట్లను ప్రారంభించాలని సర్కారు గడువుగా పెట్టుకున్నది. ఆలోగా ఈ పథకం ఆరంభం ఆయ్యే పరిస్థితి కనిపించడం లేదు.